
బ్లూ ఆరిజన్ సక్సెస్ తో ఖుషీగా అమెజాన్ ఛీఫ్
న్యూయార్క్, జూలై 21,
బ్లూ ఆరిజిన్‌కు చెందిన వ్యోమనౌక న్యూ షెపర్డ్ మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. దాంతో ఆ వ్యోమనౌకలో ప్రయాణించిన జెఫ్ బెజోస్‌తోపాటు అతని సిబ్బంది చాలామందిలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ అనుభూతిని మరింత ఇనుమడింప జేసుకోవడానికి ఈ అంతరిక్ష యాత్ర నిర్వాహకుడు జెఫ్ బెజోస్.. వారు అంతరిక్షంలో తేలియాడిన క్షణాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ భూమ్యాకర్షణ శక్తిని దాటి వెళ్లిన తర్వాత బెజోస్ సహా అందులోని పర్యాటకులు గాల్లో తేలియాడారు.జెఫ్ బెజోస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో తనతోపాటు తన సోదరుడు మార్క్, వాలీ ఫంక్, ఆలివ్ డెమెన్.. భూవాతావరణం వెలుపల జీరో గ్రావిటీ స్థితిని అనుభవించారు. ఆ సమయంలో కాసేపు స్పేస్ క్యాప్సూల్ లోపల దూదిపింజాల్లా తేలియాడారు. న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకను వెస్ట్ టెక్సాస్ ఎడారిలోని బ్లూ ఆరిజిన్‌కు సంబంధించిన ప్రైవేట్ లాంచింగ్ సైట్ నుంచి చిత్రీకరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు ఆవల ఈ వీడియో చిత్రీకరించబడింది.స్పేష్ క్రాఫ్ట్‌కు ఉన్న విశాలమైన కిటికీల నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో భూమి కూడా కనిపిస్తున్నది. బెజోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టుతోపాటు “This is how it starts. #gradatimferociter,” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘Gradatim Ferociter’ అనేది బ్లూ ఆరిజన్ నినాదం. దీనికి అడుగు, అడుగుకు క్రూరంగా అని అర్థమట. అంతరిక్షంలో పర్యటించిన అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందిన 82 ఏండ్ల వాలీ ఫంక్.. “ఫెన్టాస్టిక్.. దట్ ఈజ్ గ్రేట్… ఐ లవ్ ఇట్..” అంటున్న వ్యాఖ్యలు కూడా ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.