.jpg)
మెజారిటీ కోల్పోయిన మలేషియా ప్రధాని
కౌలాలంపూర్
మలేషియా ప్రధానమంత్రి మొయిదీన్ యాసిన్ (Moideen Yassin) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో మెజార్టీ కోల్పోవడంతో ప్రధానమంత్రి పదవికి యాసిన్ రాజీనామా సమర్పించారు. 18 నెలల కన్నా తక్కువ కాలం పాటు ప్రధానమంత్రిగా మొయిదీన్ యాసిన్ కొనసాగారు. మలేషియా చక్రవర్తిని కలిసి కేబినెట్ రాజీనామా సమర్పించినట్లు మంత్రి జమాలుద్దీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. కాగా, యునైటెడ్ మలేషియా నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు మంత్రులు కూడా కేబినెట్‌కు రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది.అతి తక్కువ కాలం పాటు ప్రధానిగా కొనసాగిన మొయిదీన్ యాసిన్ నిష్క్రమణ మలేషియాలో కొత్త రకమైన సంక్షోభాన్ని తీసుకురానున్నది. దీనితో పాటు కొవిడ్-19 పరిస్థితి కూడా అక్కడ మరింత ఉద్ధృతంగా మారే అవకాశాలున్నాయి. మలేసియా ప్రధానిగా 2020 మార్చిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంపై మొయిదీన్ పట్టు అనిశ్చితంగా ఉన్నది. అయితే కీలక మిత్రుడు మద్దతును ఉపసంహరించుకోవడంతో మొయిదీన్ మెజార్టీ కోల్పోయాడు. తనకు మెజార్టీ లేదని ఆగస్టు 13 న మొహిదీన్ ప్రకటించాడు. సంస్కరణలకు బదులుగా విశ్వాస ఓటులో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విపక్ష చట్టసభ సభ్యులను కోరారు. కొవిడ్ వ్యాప్తిని బట్టి 2022 జూలై నాటికి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలతోపాటు మిత్రపక్షమైన యూఎంఎన్‌ఓ.. మొయిదీన్ ప్రతిపాదనను తిరస్కరించాయి. దాంతో మొహిదీన్ తన రాజీనామాను సమర్పించాల్సి వచ్చింది. అత్యున్నత పదవిని పొందడం కోసం ఇప్పటికే ఉప ప్రధానమంత్రి ఇస్మాయిల్ సబ్రీతోపాటు పలువురు నాయకులు పోరాటం ప్రారంభించారు. అయితే, చాలామంది మొయిదీన్ యాసిన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటుండటం విశేషం.