YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సగం జీవోలు.... రహస్యాలే...?

సగం జీవోలు.... రహస్యాలే...?

హైదరాబాద్, ఆగస్టు 21, 
ఒకదిక్కు పరిపాలన అంతా పారదర్శకంగా జరుగుతున్నదని  చెప్తున్న సర్కారు.. మరోదిక్కు జీవోలు దాస్తోంది. 2014 జూన్ 2  నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్ర సర్కార్ 1,50,334 జీవోలు ఇచ్చింది. ఇందులో 72,786 మాత్రమే వెబ్సైట్లో ఉన్నాయి. 77,548 జీవోలు పత్తా లేవు. goir.telangana.gov.in వెబ్సైట్లో పెట్టిన జీవోల్లో  కొన్నింటికి ఏ సమాచారం లేకుండా (బ్లాంక్గా) అప్లోడ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో మంత్రులు, ఉన్నతాధికారుల టీంతో కలిసి చైనాలో పర్యటించారు. అప్పుడు ఆ పర్యటనకు సంబంధించి ఎంత ఖర్చయిందనే  వివరాలతో ఒక జీవో వెబ్సైట్లో పెట్టారు. దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో జీవోలు వెబ్సైట్లో పెట్టడం మానేశారు. దీంతో అప్పట్లోనే హైకోర్టు.. జీవోలను వెబ్సైట్లో పెట్టాల్సిందేనని ఆదేశించింది. అయితే.. నాటి నుంచి సాధారణ ఉత్తర్వులను వెబ్సైట్లో పెడుతూ కీలకమైన వాటిని ‘కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంటర్నల్’ పేరుతో ప్రభుత్వం దాచేస్తోంది. ఇలా దాస్తున్న జీవోలు ఆయా డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు, సెక్షన్ ఆఫీసర్లు మాత్రమే చూసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది? టెండర్లు ఏ రేటుకు ఎవరికి దక్కుతున్నయ్? ఎక్కడ ఏ కంపెనీకి భూములను ఎంత ధరకు కేటాయిస్తున్నరు? వంటి వివరాలతో  కూడిన జీవోలేవీ ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టట్లేదు.  టెండర్ల పద్ధతిలో ఫండ్స్ను ఎక్కువగా ఖర్చు చేసే డిపార్ట్మెంట్లలోని జీవోలే బయటకు రావడం లేదు. కీలక ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల ఉత్తర్వులు కూడా వెబ్సైట్లో పెట్టడం లేదు. సీఎం కేసీఆర్ చూస్తున్న ఇరిగేషన్, జీఏడీ, రెవెన్యూ శాఖలతోపాటు మంత్రి కేటీఆర్ చూస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, ఐటీ, ఇండస్ట్రీలకు సంబంధించిన జీవోలనే ఎక్కువగా దాస్తున్నారు.  ఆ తర్వాత ఆర్ అండ్ బీ, ఎనర్జీ డిపార్ట్మెంట్లవి ఉన్నాయి. వీటిల్లోనే ఎక్కువగా టెండర్లు, నిధుల ఖర్చుతో పాటు, భూ కేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జీవోలు, ప్రజాప్రతినిధులకు భూ కేటాయింపుల ఉత్తర్వులు ఉంటాయి. ఆఫీసర్లకు ఇచ్చే ఎక్స్టెన్షన్, కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలు, వెహికల్స్ కొనుగోలు, కరెంట్ కొనుగోళ్లకు సంబంధించిన జీవోలు కూడా ప్రభుత్వం దాచేస్తోంది. సర్కార్ తీసుకునే నిర్ణయాలు, పాలసీలకు ఎక్కడైనా  ఇబ్బంది వస్తుందని భావిస్తే వాటి తాలూకు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే వెబ్సైట్లో పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్కు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది వందల సంఖ్యలో ఉత్తర్వులు రిలీజ్ చేస్తే అందులో మూడు మాత్రమే ఆన్లైన్లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, లే ఔట్లకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని ఆన్లైన్లో పెట్టలేదు. ఇక ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ ఏడాది 28 జీవోలు అందుబాటులో ఉంచారు. 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ అడ్మినిస్ర్టేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో  5,359 జీవోలు ఇస్తే.. అందులో 1,540 మాత్రమే పెట్టి.. మిగతా 3,799 దాచారు. ఇండస్ర్టీస్, కామర్స్, మైనింగ్ డిపార్ట్మెంట్లలో 2014 నుంచి 2019 వరకు  2,009 జీవోలు ఇస్తే.. ఇందులో  670 జీవోలు రహస్యంగా ఉంచారు. ఇవన్నీ బడ్జెట్  రిలీజ్ ఆర్డర్కు సంబంధించినవే.తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 50 వేల 334 జీవోలు రిలీజ్ అయ్యాయి. ఈ లెక్కన ప్రతి ఏడాది యావరేజ్గా విడుదల చేస్తున్న జీవోలు సంఖ్య 21 వేలుగా ఉంటోంది. అదే వెబ్సైట్లో పెట్టిన జీవోలు మాత్రం అన్ని లేవు.  2014  జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు 10,282 జీవోలు వెబ్సైట్లో పెట్టారు. 2015లో 21,702 జీవోలు,  2016లో 13, 249 జీవోలు, 2017లో  8761 జీవోలు అప్ లోడ్ చేశారు. 2018లో 6,858 జీవోలు, 2019లో 4,701 జీవోలు, 2020లో  4,207 జీవోలు, ఈ ఏడాది ఈ నెల 17 వరకు 3,026 జీవోలు అప్ లోడ్  చేశారు.ప్రభుత్వం వెబ్సైట్లో పెడుతున్న జీవోల్లో ఎక్కువగా ప్రజలకు పెద్దగా ఉపయోగపడనివే ఉంటున్నాయి. ఉద్యోగుల మెడికల్ బిల్లులు, లీవ్లు, సెల్ఫోన్ బిల్లుల చెల్లింపులు, ఆయా డిపార్ట్మెంట్లలో నిర్వహణ ఖర్చులు, ఔట్‌‌సోర్సింగ్‌‌ సిబ్బంది విధుల కొనసాగింపు వంటి వాటికి సంబంధించినవే కనిపిస్తున్నాయి. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (1) (సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అందులో భాగంగానే జీవోఐఆర్ వెబ్సైట్ ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేశారు.

Related Posts