
న్యూ ఢిల్లీ ఆగష్టు 28
కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్‌లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్రోన్‌లతో విరుచుకుపడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగహార్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడి చేశామని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వెలుపల నుంచి ఈ దాడి జరిపినట్లు చెప్పారు. కాగా, కాబూల్ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, అందువల్ల పౌరులు ఎయిర్‌పోర్టును ఖాళీ చేయాలని అమెరికా హెచ్చరించింది.గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో 183 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉండగా, 170 మంది ఆఫ్ఘన్ పౌరులు ఉన్నారు. మరో 200 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఐసిస్ నాయకులను అంతమొందించాలని సైన్యాన్ని ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది.