
ఆస్ట్రేలియాలో భూ కంపం
మెల్ బోర్నో, సెప్టెంబర్ 22,
స్ట్రేలియాలో భారీ భూకంపం సంభవించింది. రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్ సమీపంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా రికార్డయింది. చాలా సేపటివరకు భవనాలు ఊగుతుండటంతో తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. మౌంట్ బుల్లర్‌కు ఈశాన్యాన 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్యాన్స్‌ఫీల్డ్ టౌన్‌లో భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే వెల్లడించింది.ఆస్ట్రేలియాలో సంభవించిన రెండో అతి పెద్ద భూకంపంగా దీన్ని భావిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇంతే తీవ్రతతో భారీ భూకంపం వచ్చిందని ఆస్ట్రేలియా జియోసైన్స్ తెలిపింది. 2019లో బ్రూమె టౌన్ సమీపంలో 6.6 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. 50 వేలకు పైగా భవనాలు, ఇతర నివాస సముదాయాలు ధ్వంసం అయ్యాయి. ఆ స్థాయిలో మళ్లీ భూమి కంపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. మెల్‌బోర్న్‌లోని సౌత్ యర్రాలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనాల శిథిలాలు మీద పడి కొందరు వాహనదారులు సైతం గాయపడ్డారు. పార్క్ చేసి ఉంచిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రధాన భూకంపం తీవ్రత తగ్గిన తరువాత కూడా స్వల్పస్థాయిలో ప్రకంపనలు కొనసాగడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు.సమాచారం అందుకున్న ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ప్రధానమంత్రి స్కాట్ మోరిస్ స్పందించారు. భూకంపం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం అందలేదని తెలిపారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలంటూ ఆయా నగరాల మేయర్లను ఆదేశించారు.