
బిజీ బిజీగా ప్రధాని
న్యూయార్క్, సెప్టెంబర్ 24,
అమెరికా పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ దేశంలోని టాప్ గ్లోబల్ కంపెనీల సీఈఓలతో సమావేశమైన నరేంద్ర మోడీ.. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురూ భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంశాలపై చర్చించారు. ఇక సమావేశం అనంతరం ప్రధాని మోడీ… అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు నాయకులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.కమలా హ్యారీస్ తాత పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన చెక్క జ్ఞాపికను ప్రధాని మోడీ ఆమెకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చారు. అలాగే ప్రధాని మోడీ గులాబీ మీనాకారీ చెస్ సెట్‌ను కూడా కమలా హ్యారీస్‌కు బహుకరించారు. ఈ చెస్ సెట్ రూపకల్పన భారతదేశంలోని పురాతన నగరాల్లో ఒకటైన కాశీ హస్తకళలను ప్రతిబింబిస్తుంది. అందులోని ప్రతీ భాగం అద్భుతంగా రూపొందించబడింది.ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి కమలా హ్యారీస్ స్పూర్తిదాయకంగా నిలుస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ నాయకత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.మరోవైపు ఇతర క్వాడ్ లీడర్స్‌తో సమావేశమైన పీఎం మోడీ.. వారికి కూడా ప్రత్యేక బహుమతులను ఇచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్‌కు వెండితో నిండిన మీనకారీ నౌకను బహుమతిగా ప్రధాని మోడీ అందజేశారు. ఇది ప్రత్యేకించి చేతితో తయారు చేశారని తెలియజేశారు. అలాగే జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. భారత్, జపాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో బౌద్ధమతం కీలక పాత్ర పోషించింది. గతంలో జపాన్‌లో పర్యటించినప్పుడు, మోదీ అక్కడ ఉన్న పలు బౌద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు.