
న్యూఢిల్లీ సెప్టెంబర్ 25
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ తన ప్రసంగంలో కోరారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు యూఎన్‌లోని భారత ప్రతినిధి స్నేహ దూబే కౌంటర్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్, లడాఖ్‌లు.. ఎప్పటికీ ఇండియాలోనే భాగమని ఆమె స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లడాఖ్‌లను ఇండియా నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డాగా మారుతోందని ఆమె ఆరోపించారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు ఓపెన్‌గా అంగీకరిస్తున్నాయని ఆమె అన్నారు.యూఎన్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్‌లవాదులు ఎక్కువ శాతం పాకిస్థాన్‌లో ఉన్న విషయాన్ని గ్రహించాలని దూబే తెలిపారు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని ఆమె ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థానే ఆశ్రయం ఇచ్చిందన్నారు. ఇప్పటికీ ఆ ఉగ్రవాదిని పాకిస్థాన్ ఓ అమరుడిగా గుర్తిస్తోందన్నారు. పాకిస్థాన్ ఓ అరాచక దేశమని, కానీ ప్రపంచ దేశాలకు భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పాక్ అవలంబిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని దూబే పేర్కొన్నారు.సుదీర్ఘకాలం నుంచి ఇండియా, పాక్ మధ్య ఉన్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ కోరారు. వీడియో లింకు ద్వారా ఆయన యూఎన్ సమావేశాల్లో మాట్లాడారు. భారత్ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోందని, అత్యాధునిక అణ్వాయుధాలను డెవలప్ చేస్తోందని, దీని వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో హిందూ తీవ్రవాదం పెరుగుతోందని, దీని వల్ల ముస్లిం జనాభాకు సమస్య వస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు.