
ముంబై, డిసెంబర్ 4,
ఫ్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్‌గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. తగ్గుముఖం పడుతున్న కరోనా నుంచి ఇప్పుడిప్పుడే పలు దేశాలు కోలుకుంటున్నాయి. కరోనా విజృంభన సమయంలో విధించి లాక్‌డౌన్ కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా భారత్‌లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రెండు నమోదు కావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ఇండియా వస్తుందా..? వస్తే ఎలా ఎదుర్కొవాలి..? అనే ప్రశ్నలతో అధికార యంత్రాంగం మునిగిపోయింది. ఆ ప్రశ్నలకు జవాబులు సమాధానం దొరకక ముందే ఒమిక్రాన్ ఇండియాపై దాడి మొదలు పెట్టింది. కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టుకు నవంబర్ 11న ఒకరు, నవంబర్ 20 మరొకరు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చారు. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యలు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి జినోమ్ సీక్వెన్సికి పంపించారు. జినోమ్ ఫలితాల్లో ఒమిక్రాన్‌గా తేలడంతో భారత్‌లో మరోసారి టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ సోకిన వారి కాంటాక్ట్ లిస్టును కూడా ట్రేస్ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఒమిక్రాన్ సోకిన దేశాల్లో ఒకటైన బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జినోమ్ సీక్వెన్సీకి ఆమె శాంపిల్స్‌ను వైద్యులు పంపించారు. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో వెలుగుచూసిన నేపథ్యంలో భారతీయుల్లో నెలకొన్న ప్రశ్న ఒక్కటే..? మొదట కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్‌డౌన్ విధించాయి. ఆ తరువాత డెల్టా వేరియంట్ రూపంలో 3రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మరోమారు లాక్‌డౌన్‌కు విధించక తప్పలేదు. అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా..? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్ ను ఎంతమేర కట్టడి చేస్తాయో చూడాలి మరి.