YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కామ్రేడ్ కంట్రీపై భారీగా ఆంక్షలు

కామ్రేడ్ కంట్రీపై భారీగా ఆంక్షలు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 26,
ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం రానుందా? వర్తక, వాణిజ్య రంగమే కాదు..మిగతా వాటిపై ఎంత మేరకు దాని ప్రభావం పడనుంది. రష్యాపై మూకుమ్మడిగా ఆంక్షలతో సాధించేంటి..? అయినా కామ్రేడ్ కంట్రీ ఎందుకు ముందుకే వెళుతుందనేది ఆసక్తికరం. ప్రపంచ దేశాలతో పోలిస్తే రష్యా ఉత్పత్తి సామర్ధ్యం ఇలా ఉంది. పల్లాడియమ్‌ 45.6 శాతం, ప్లాటినమ్‌ 15.1 శాతం, బంగారం 9.2 శాతం, ఆయిల్‌ 8.4 శాతం, గ్యాస్‌ 6.2 శాతం, నికేల్‌ 5.3 శాతం, గోధుమలు 5 శాతం, అల్యూమినియం 4.2 శాతం, కోల్‌ 3.5 శాతంగా ఉంది. రష్యా వాణిజ్య ఎగుమతుల్లో ఎక్కువగా పెట్రోలియం, నూనెలు, బొగ్గు, సహజవాయువు, గోధుమలు ఉంటున్నాయి.ప్రపంచంలోని 224 దేశాలతో రష్యా వర్తక, వాణిజ్యం చేస్తోంది. రష్యా మొత్తం ఎగుమతుల విలువ (FOB) US$ 426,720 మిలియన్లు అయితే…దిగుమతుల విలువ (CIF) US$ 247,161 మిలియన్లుగా ఉంది. 4,385 ఉత్పత్తులను 198 దేశాలకు రష్యా ఎగుమతి చేస్తుండగా…4,426 ఉత్పత్తులు 224 దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది.
రష్యా ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, జర్మనీ, బెలారస్, అమెరికా, ఇటలీ ఉన్నాయి. చైనా నుంచి 54,142 మిలియన్ల డాలర్లు దిగుమతులు ( 21.91 శాతం వాటా), జర్మనీ నుంచి 25,110 మిలియన్ డాలర్లు దిగుమతి (10.16 శాతం), బెలారస్ నుంచి 13,663 మిలియన్ డాలర్లు దిగుమతి (5.53 శాతం),  అమెరికా నుంచి 13,429 మిలియన్ డాలర్లు దిగుమతి ( 5.43 శాతం), ఇటలీ నుంచి 10,908 మిలియన్ డాలర్లు దిగుమతులు (4.41 శాతం) ఉన్నాయి.రష్యా ఎగుమతులు ఎక్కువగా చైనా, నెదర్లాండ్స్, జర్మనీ, బెలారస్, టర్కీ దేశాలతో ఉంటున్నాయి. చైనాకు 57,321 మిలియన్ డాలర్లు ఎగుమతి (13.43 శాతం), నెదర్లాండ్స్ 44,788 మిలియన్ డాలర్లు ఎగుమతి (10.50 శాతం), జర్మనీ 28,049 మిలియన్ డాలర్లు ఎగుమతి (6.57 శాతం), బెలారస్ 21,708 మిలియన్ డాలర్లు (5.09 శాతం), టర్కీకి 21,150 మిలియన్ల డాలర్లు ఎగుమతులు (వాటా 4.96 శాతం) ఉన్నాయి.
భారత్ -రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం..
2020-21 8.1 బిలియన్ డాలర్ల వాణిజ్యం ( సుమారు రూ.61,000 కోట్లు)భారత్ -రష్యా మధ్య జరిగింది. ఇందులో రష్యాకు భారత్ ఎగుమతులు…2.6 బిలియన్ డాలర్లు ( రూ. 19,500 కోట్లు) ఉండగా..రష్యా నుంచి భారత్ దిగుమతులు 5.5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) ఉంది.భారతదేశం నుంచి మందులు, రసాయనాలు, విద్యుత్ యంత్ర సామగ్రి, తేయాకు, దుస్తులు, మరికొన్ని పెట్రోలియం ఉత్పత్తులు ఉండగా…ఆయుధాలు, ఆయుధ సామగ్రి, బొగ్గు, ముడి చమురు, లోహాలు ఎరువులను మనం ఎక్కువగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
ఉక్రెయిన్-భారత్ మధ్య వర్తకం..
ఉక్రెయిన్-భారత్ మధ్య ఏటా 2.5 బిలియన్ డాలర్ల (రూ.19,000 కోట్లు) వాణిజ్యం సాగుతోంది. ఇందులో లోహాలు, ప్లాస్టిక్, పాలీమర్స్, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు మన దిగుమతులుగా ఉండగా…మందులు, యంత్ర సామగ్రి, రసాయనాలు, ఆహారపదార్థాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం.
యుద్ధంతో ఇంకా కొనసాగితే భారత్‌లో పెట్రోలియం, ఆయుల్ ధరలు, నాచురల్‌ గ్యాస్‌ ( రష్యా నుంచి దిగుమతి), ఎడిబుల్‌ ఆయిల్‌, ఆహారధాన్యాలు, మెటల్‌ ( ఆటో, ఎయిర్‌లైన్స్‌, ఆయుధాలు ధరల పై ప్రభావం పడుతోంది. ఇప్పుడు ఈ ధరలు పెరగడం ఇబ్బందికరమే.
పెద్దన్న దేశం ఏం చేస్తోంది..
రష్యా పై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. డాలర్‌ లావాదేవీలను బంద్ చేసింది. రష్యా కరెన్సీలోకి డాలర్లు మారకం లేకపోతే ఆ మేరకు ప్రభావం పడనుంది. అంతే కాదు..అమెరికాలో రష్యా బ్యాంకు సేవలు బ్యాన్‌ చేసింది. సాంకేతిక రంగాలకు అవసరమైన ఉత్పత్తుల సరఫరాను పూర్తిగా బంద్ చేసింది. ముఖ్యంగా ఆయుధాల్లో వాడే టెక్నాలజీ సాయం బంద్‌ చేయడం హాట్ టాపికైంది.అమెరికానే కాదు..27 దేశాల సభ్యత్వం ఉన్న యూరోపియన్ యూనియన్ (EU) ఆంక్షలు విధించింది. ముఖ్యంగా డిఫెన్స్‌ సంస్థల లావాదేవీలు రద్దు చేసింది. రష్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను తాత్కాలికంగా బంద్‌ చేయడంతో ఆ మేరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిఫైనరీస్‌లో వాడే మెటీరియల్‌ సరఫరాను ఆపు చేసింది. యుద్ధంలో ఉపయోగపడే ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎక్విప్‌మెంట్‌ సరఫరా రద్దు చేయడంతో ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో రష్యాకు ఇబ్బందే. సాఫ్ట్‌వేర్‌, సెమీ కండక్టర్‌ సేవలను పరిమితం చేసింది.అమెరికా, ఈయూనే కాదు..బ్రిటన్ (UK) ఆంక్షల కొరఢా ఝలిపించింది. రష్యా బ్యాంకుల సేవలను పూర్తిగా రద్దు చేసింది. యూకే మార్కెట్లో రష్యా పెట్టుబడులు పెట్టవద్దని ఆదేశమిచ్చింది. ఎవరైనా కొత్తగా రష్యా నుంచి పౌరులు వద్దామనుకుంటే కుదరదని చెప్పేసింది. అబ్బాయ్ మీరు రావద్దు. మమ్మలను రమ్మని పిలవద్దని చెప్పేసింది. బ్రిటన్ కు వచ్చే రష్యా ఎయిర్‌లైన్స్‌పై నిషేధం విధించింది. హైటెక్‌, రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపేయడమే కాదు యూకే బ్యాంకుల్లో పరిమితంగానే రష్యన్ల నిధులు డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకుంది. ఇక జర్మనీ అయితే రష్యాతో చేసుకున్న వాణిజ్యం బంధాలపై పునరాలోచన చేస్తామని హెచ్చరించింది. అంతే కాదు నార్డ్‌ స్ట్రీమ్‌ గ్యాప్‌ పైప్‌లైన్‌-2 ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం రష్యా పెద్ద దెబ్బ.
రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా, ఈయూ స్విఫ్ట్ ఆయుధాన్ని ఎక్కుపెట్టాయి. రష్యా బ్యాంకులతో స్విఫ్ట్ లింక్ ను తెంచితే ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని కోల్పోతాయి. సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ (స్విఫ్ట్) అనేది ఒక అంతర్జాతీయ నగదు లావాదేవీల వ్యవస్థ. పలు దేశాల మధ్య నగదు లావాదేవీలు సాఫీగా, వేగంగా జరిగేలా స్విఫ్ట్ దోహదం చేస్తోంది. 1973లో బెల్జియం కేంద్రంగా ఏర్పాటు చేసిన స్విఫ్ట్ లో 200కి పైగా దేశాలకు చెందిన 11 వేల బ్యాంకుల నెట్‌వర్క్‌ ఉంది. స్విఫ్ట్ సాధారణ బ్యాంకు కాదు. ఖాతాలోకి నగదు వచ్చినప్పుడు, డెబిట్ అయినప్పుడు వినియోగదారుడికి సమాచారం అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టమ్ అంతే. వివిధ దేశాల ప్రభుత్వాలు, సంస్థల మధ్య జరిగే లక్షల కోట్ల డాలర్ల నగదు లావాదేవీలను ఇది చెబుతోంది. ఎట్ట లేదన్నా రోజుకు 4 కోట్లకు పైగా సందేశాలను స్విఫ్ట్ పంపిస్తుంది. ఇందులో 1 శాతం కంటే ఎక్కువ రష్యా సంబంధిత చెల్లింపులవే ఉంటాయి. ఈ నెట్‌వర్క్ నుంచి రష్యాను తప్పిస్తే ఆ దేశంలోని బ్యాంకింగ్ నెట్‌వర్క్ దెబ్బతిని నిధుల యాక్సెస్ పై ప్రభావం పడుతోంది. ఆ పని చేస్తే రష్యాకే కాదు…వివిధ దేశాల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపైనా ప్రభావితం పడుతుందని భయపడుతున్నాయి.నాటో, ఈయూలోని మెజార్టీ దేశాలు రష్యా తీరును తప్పుపడుతున్నాయి. భారత్‌లో ఫార్మా ఎగుమతులపై ప్రభావం పడుతుండగా.. ఆయిల్‌ దిగుమతులు తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ ఉత్పత్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో రష్యా ఒకటి. ప్రస్తుతం ఆంక్షలు విధిస్తే ఆటో సహా స్టీల్‌ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక ఆఫ్రికా దేశాలకు గోధుముల కొరత తప్పదు. ఆంక్షల మధ్య తలెత్తే ఆర్ధిక పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో గుబులు మొదలైంది. రష్యాకు ఎగుమతులు చేసి ఆర్ధికంగా లాభపడే దేశాలకు ఇది నష్టం కలిగించే చర్యనే. రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు రాకపోతే తలేత్తే సంక్షోభంతో చాలా దేశాలను ప్రమాదం ముంగిట నిలిచినట్లే. యుద్ధం శాంతిని హరిస్తోంది. యుద్ధం ఆర్థిక సంక్షోభాన్ని మోసుకొస్తోంది. అందుకే అంతా శాంతి శరణం గచ్చామి అంటున్నారు. వీలున్నంత తొందరగా యుద్ధం ముగియాలని కోరుకోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Posts