YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ నేతల్లో నిరాశ... నిస్పృహ

పార్టీ నేతల్లో నిరాశ... నిస్పృహ

విజయవాడ, మార్చి 2,
ఏపీలో ఏ వర్గం ప్రజలు ప్రభుత్వం పట్ల అంత సంతృప్తిగా లేరు. మరీ అసంతృప్తిగా లేరు. జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతుంది. అయితే ఈ మూడేళ్లలో ప్రజల మూడ్ ఎలా ఉందో కనుగొనే ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం మాత్రం నాకు కొంత అర్థమయింది. జగన్ మీద ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందని నేను కూడా అనుకున్నాను. ప్రతి పనిలో తప్పులు వెతుకుందని భావించాను. కానీ నాకు తెలిసిందేమిటంటే అందులోనూ 50 శాతం నిజాలే ఉన్నాయి.  జగన్ పార్టీ నేతలు అనుకున్నట్లు వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమేనని పించింది. జగన్ కూడా తాను 3.5 కోట్ల మందికి ప్రతి ఏటా ఏదో ఒక పథకం రూపంలో లబ్ది అందచేస్తున్నానని, ఈ ఓట్లన్నీ తమవేనన్న భావనలో ఉన్నట్లు ఉంది. అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆటో కార్మికులకు ఇస్తున్న పదివేల రూపాయలతో వారు ఏమంత సంతోషంగా లేరు. జగన్ ఇస్తున్నాడన్న తృప్తి ఉంది తప్పించి ఈ ప్రభుత్వానికే తిరిగి ఓటు వేయాలన్న కసి వారిలో నాకు కన్పించలేదు. వారితో స్వయంగా మాట్లాడటంతో నాకు ఈ విషయం అర్థమయింది. తాడేపల్లి కార్యాలయంలో బటన్ నొక్కి డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లోకి మళ్లించినంత మాత్రాన పెద్దగా జగన్ పట్ల సానుకూలత నాకు కన్పించలేదు.ఇక ఏపీలో అభివృద్ధి ఎంత మాత్రం జరగలేదన్నది కొందరి అభిప్రాయం. కరోనా కారణంగా తాము ఏమీ చేయలేకపోయామన్న వైసీపీ నేతల వాదనను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ ప్రాంతానికి జరిగిన అభివృద్ధిపై వారు బాగానే చర్చించుకుంటున్నట్లు కన్పించింది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి అభివృద్ధిలో తేడాపై ఏపీ ప్రజలు ఒక స్పష్టతతో ఉన్నారు. మూడేళ్ల నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేదన్న భావనతో ఉన్నారు. కనీసం రహదారులకు మరమ్మత్తులు చేసిన పాపాన పోలేదన్న భావన వారిలో నాకు కన్పించింది.  వైఎస్ వివేకా హత్య కేసుపై కూడా జనంలో చర్చ బాగానే జరుగుతుంది. జగన్ తన సోదరి వైఎస్ సునీతను ఈ కేసు విషయంలో దూరం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. బాబాయి హత్య కేసులో నిందితుడు ఎవరో తేలితే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో కన్పించింది. అలాగే తన సోదరి షర్మిలను రాజకీయంగా పక్కన పెట్టడంపై కూడా ప్రజల్లో పెద్దయెత్తున చర్చ కనిపిస్తుంది. వైఎస్ కు ఆత్మీయులందరూ జగన్ కు దూరమవుతున్న విషయంపైన కూడా ప్రజలు చర్చించుకోవడం కన్పించింది. ఒక వర్గం అంటూ లేదు. వ్యాపారులు, ఉద్యోగులు, సామాన్యుల వరకూ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు కనిపించింది.జిల్లాల ఏర్పాటుపై కూడా పెద్దగా ప్రజలు తృప్తిగా లేరు. అశస్త్రీయంగా జిల్లాలను విభజించారని, దశాబ్దాల కాలంగా ఒక జిల్లాలో ఉన్న ప్రాంతాలను విడకొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అనుకుంటున్నట్లు, అధికారులు చెబుతున్నట్లు ప్రభుత్వంపై సంతృప్త స్థాయి మాత్రం సరిగా లేదు. జగనన్న తోడు పథకాలు కలసి వస్తాయన్న నమ్మకం నాకయితే కలగడం లేదు. కొంత విపక్ష నేత సమర్థత, పాలనపైనే చర్చించుకోవడం నాకు కన్పించింది. విన్పించింది. నేను పర్యటించిన జిల్లా వైసీపీ, టీడీపీీలకు వన్ సైడ్ మాత్రం కాదు. గత ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ ఇక్కడ అత్యధిక స్థానాలు ఏకపక్షంగా వచ్చిందీ లేదు. రానున్న రెండేళ్లలో జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ఏమో చెప్పలేం కాని, ఇప్పటికయితే జగన్ కు వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని వ్యక్తిగతంగా నాకు అన్పించింది.

Related Posts