YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

యుద్ధం.. భారత్ పై తీవ్రప్రభావం

యుద్ధం.. భారత్ పై తీవ్రప్రభావం

ముంబై, మార్చి 4,
ఒక్క యుద్ధం.. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇదే సంగతి చెప్పాయి. తాజాగా ఉక్రెయిన్ వార్‌..మన పొరుగుదేశం శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది.ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను.. చమురు ధరల పెరుగుదల నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర రెండు వందలు దాటింది. నిత్యవసరాల ధరలు … మరింత పెరగడంతో, సామ్యాన్యుడి బతుకు.. దినదినగండంలా మారింది.
రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి మనదేశంపై యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతుంది? బంగారం, క్రూడ్‌ ఆయిల్‌, వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతాయా?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. సామాన్యుడి జీవితం మరింత భారంగా మారనుంది. వంట నూనె, బంగారంతో పాటు చాలా వస్తువుల రేట్లు భారీగా పెరగనున్నాయ్‌. మన దేశానికి వస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు రష్యా, ఉక్రెయిన్ల నుంచే దిగుమతి అవుతుంది. దేశంలో ఎక్కువ మంది వాడే వంట నూనెల్లో మొదటి స్థానం పామాయిల్ ఉంటే, రెండో స్థానం సన్ ఫ్లవర్ ఆయిల్ దే. మనం వాడే మొత్తం వంట నూనె ఉత్పత్తుల్లో అరవై శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యా దేశాలపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల ద్వారా సమకూర్చుకునే సన్ ఫ్లవర్ ఆయిల్ లో 70 శాతం ఉక్రెయిన్ నుంచి కాగా, ఇరవై శాతం రష్యా నుంచి దిగుమతి అవుతుంది.ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్దంతో భారత్ వచ్చే దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం మొదలైన తర్వాత ఫిబ్రవరి నెలలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. లక్షల టన్నుల్లో రావాల్సిన వంట నూనె దిగుమతి నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితి మరో రెండు మూడు వారాలు కొనసాగితే రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పటికే 100 డాలర్లకు చేరింది. గత ఏడు సంవత్సరాల్లో క్రూడాయిల్ రేటు ఇదే గరిష్టం. అటు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి.మరి కొన్ని రోజులు ఇదే కొనసాగితే మాత్రం మరింతగా క్రూడాయిల్, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గోధుమలను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో ఉంటే నాలుగో దేశంగా ఉక్రెయిన్ ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా గోధుమల రేట్లు సైతం భారీగా పెరుగుతాయని చెబుతున్నారు.

Related Posts