YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఐఏఎస్, ఐపీఎస్ ల మధ్య రాజకీయ రచ్చ

 ఐఏఎస్, ఐపీఎస్ ల మధ్య రాజకీయ రచ్చ

హైదరాబాద్, మార్చి 5,
తెలంగాణలో, బీహారు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆధిపత్యాన్ని గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈమధ్య అదే బీహారుకు చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ముఖ్యమంత్రి కేసీఆర్’తో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేపధ్యంలో, మళ్ళీ మరోమారు, బీహార్ బాబుల వ్యవహారం చర్చకు వచ్చింది. అటు అధికార వర్గాల్లో, ఇటు రాజకీయ, మీడియా వర్గాల్లోనూ, బీహార్ అధికారుల ఆధిపత్యం, తెలంగాణ అధికారాలుకు జరుగుతున్న అన్యాయం, వివక్ష గురించి బహిరంగ చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం బీహారీ బాబులకు పెద్ద పీట వేస్తోంది, తెలంగాణ అధికారుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నాయి. అయితే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేయడం, సరి కాదని, చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాంటి విమర్శలు తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీస్తాయని, రాజ్యాంగ, అధికార విధులకు అవరోధాలు అవుతాయని, అధికార విధుల్లో జోక్యం చేసుకోవడంగా పరిగణించవలసి ఉంటుందని అంటున్నారు. అయితే, రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలే చేస్తారనేది జగమెరిగిన సత్యం. నిజానికి, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తమ ప్రకటనలలో పేర్కొనకపోయినా, ఇందుకు సంబంధించి బహిరంగ విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిగానీ మరొకరు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని  విమర్శించారే, కానీ, అధికారులు తప్పు చేశారని, అనలేదు. అయితే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు, గుమ్మడి కాయ దొంగ ఎవరంటే బుజాలు తడుము కున్నట్లు, ఒకరి తర్వాత ఒకరుగా, రాజకీయ నాయకుల ప్రకటనలను ఖదిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అంతే కాదు, ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా,కొందరు రాజకీయ నాయకులకు బాధ్యతా రహిత  ప్రకటనాలు చేయడం అలవాటుగా మారిపోయిందని.  అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా అధికారులే రాజాకీయ విమర్శలపై స్పందించి ‘గీత’ దాటారు, ఒక విధంగా  రాజ భక్తిని ప్రదర్శించుకున్నారని, అధికార  వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అంతే కాదు, తెలంగాణ అధికారుల పట్ల వివక్ష చూపుతున్నారని న్యాయస్థానాలు పేర్కొన్న సందర్భాలు లేక పోలేదని అంటున్నారు . ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్’ కు ఏకంగా సమన్లు జారీ చేసిందని గుర్తు చేస్తున్నారు.  అయితే, రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు నిజంగా  గీత దాటి, అధికారుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినా, అధికారుల రాజ్యాంగ (రాజకీయ కాదు) విధులకు అవరోధం కలిపించిన, చట్టం పరిధిలో చర్యలు తీసుకునే అధికారం, అవకాశం అధికారులకు ఉంటాయి. అంతే కానీ, ఆకాశ రామన్న, లేఖలు రాసి, ప్రకటనలు చేసి, కనీసం ఎవరిని ఉద్దేశించి, ఎందుకోసం ప్రకటన చేశారో కూడా తెలియని విధంగా ప్రకటనలు చేయడం తగదని, రాజకీయ నాయకులు అంటున్నారు. చిత్రం ఏమంటే, ఐఏస, ఐపీఎస్ అధికారుల పేరున విడుదలవుతున్న ప్రకటనలపై, ఊరు పేరు లేవు. ఎవరి సంతకము లేదు .. అందుకే ఐఏస్, ఐపీఎస్ అధికారుల ప్రకటనలను ఆకాశ ‘రామన్న’ ప్రకటనలు అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

Related Posts