YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గన్నవరానికి ఇంటి పోరు...

గన్నవరానికి ఇంటి పోరు...

విజయవాడ, మార్చి 7,
వ‌ల్ల‌భ‌నేని వంశీ. మొద‌టినుంచీ వార్త‌ల్లో ఉండే వ్య‌క్తి. ఇటీవ‌ల కాలంలో మోస్ట్ కాంట్ర‌వ‌ర్సీ లీడ‌ర్‌. టీడీపీ జెండాతో గెలిచి.. పార్టీకి పంగ‌నామాలు పెట్టాడని త‌మ్ముళ్లు తెగ ఫైర్ మీదున్నారు. వైసీపీతో అంట‌కాగుతూ.. న‌రంలేని నాలుక‌తో నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నాడంటూ మండిప‌డుతున్నారు. నారా లోకేశ్‌- భువ‌నేశ్వ‌రిల‌పై అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసి.. మ‌హిళాలోకంతో ఛీ కొట్టించుకున్నారు. కొడాలితో స్నేహం చేస్తూ.. ఆయ‌న‌లానే ఈయ‌నా రోడ్డున ప‌డుతున్నారు. త‌న త‌ల్లిని అవ‌మానించిన ఆ న‌లుగురి సంగ‌తి చూస్తానంటూ నారా లోకేశ్ ఇప్ప‌టికే శ‌ప‌థం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీపై స్ట్రాంగ్ రివేంజ్ కోసం ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌ఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. గ‌న్న‌వ‌రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. క‌మ్మ ఇలాఖా. అక్క‌డ టీడీపీకి తిరుగులేని చ‌రిత్ర‌. గ‌న్న‌వ‌రంలో ఇప్ప‌టికీ ఐదుసార్లు టీడీపీ జెండా ఎగిరింది. ప‌సుపు జెండా వ‌దిలేయ‌డంతో.. ఈసారి వ‌ల్ల‌భ‌నేనికి ఓట‌మి త‌ప్ప‌దంటున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు, ప్ర‌త్యేకించి క‌మ్మ వ‌ర్గీయులు వంశీని త‌మ శ‌త్రువుగా చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ధి చెప్పేందుకు మ‌హిళ‌లు రెడీగా ఉన్నారు. ప్ర‌జ‌లే కాకుండా.. వంశీని ఓడించేందుకు టీడీపీ హైక‌మాండ్ సైతం నేరుగా దృష్టి పెట్టింది. అందుకే బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వేట మొద‌లుపెట్టింది. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన వంశీకి 9 వేలకు పైగా మెజారిటీ వ‌చ్చింది. 2019లో జగన్ వేవ్‌లో మెజారిటీ 990కి ప‌డిపోయింది. ఇదంతా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే. ఈసారి వంశీ వైసీపీ కండువాతో బ‌రిలో దిగితే.. ఆ మాత్రం ఓట్లు కూడా రాక‌పోవ‌చ్చ‌ని అంచ‌నా. గ‌న్న‌వ‌రంలో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వెతుకుతోంది టీడీపీ. గ‌తంలో ఒక్క‌డి నుంచే ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన‌.. గ‌ద్దె రామ్మోహ‌న్ అయితే బాగుంటుంద‌ని అధిష్టానం భావిస్తున్నా.. ఆయ‌న మాత్రం విజ‌య‌వాడ తూర్పును వ‌దిలేది లేదంటున్న‌ట్టు తెలుస్తోంది. గ‌ద్దె కాక‌పోతే దాస‌రి అయినా బ‌లమైన కేండిడేట్ అవుతార‌ని అంచ‌నా వేస్తోంది. దాస‌రి బాల‌వ‌ర్థ‌న‌రావు గ‌తంలో రెండుసార్లు గ‌న్న‌వ‌రం నుంచి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు. అక్క‌డ ఎలాంటి ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో.. ప్ర‌స్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పిలిస్తే వ‌చ్చేసేందుకు.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న సైతం సిద్ధమేన‌ట‌. ఇక, గ‌న్న‌వ‌రంలో వైసీపీ విష‌యానికి వ‌స్తే.. వ‌ల్ల‌భ‌నేనిని క‌రివేపాకులా వాడుకుని వ‌దిలేసే అవ‌కాశ‌మే ఎక్కువ అంటున్నారు. ఇప్ప‌టికే భువ‌నేశ్వ‌రి విష‌యంలో వంశీ చేసిన‌ వ్యాఖ్య‌ల‌తో వైసీపీకి తీవ్ర డ్యామేజీ జ‌రిగింది. మ‌హిళాలోక‌మంతా భ‌గ్గుమంటోంది. అలాంటి వంశీని తాము ఓన్ చేసుకుంటే.. అస‌లుకే ఎస‌రు రావ‌డం ఖాయ‌మ‌నే భావ‌న‌లో ఉంది వైసీపీ. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని త‌మ‌వాడేన‌ని ఓపెన్‌గా చెప్పుకోలేని దుస్థితి. ప‌లువురు నేత‌లు.. వంశీతో త‌మ‌కేం సంబంధం లేద‌ని.. ఆయ‌న త‌మ పార్టీ కాదంటూ.. ప‌దే ప‌దే దూరం జ‌రుగుతున్నారు. కేవ‌లం కొడాలి నాని మాత్ర‌మే వంశీని వెంటేసుకుని తిరుగుతున్నారు. దొందు దొందే కాబ‌ట్టి. వ‌ల్ల‌భ‌నేనిపై బాగా నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది కాబ‌ట్టి.. ఆయ‌న‌ను వైసీపీ త‌ర‌ఫున పోటీలో దించే ఛాన్స్ త‌క్కువే అంటున్నారు. ఒక‌వేళ కొడాలి ప్రెజ‌ర్‌తో టికెట్ ఇచ్చినా ఆయ‌న గెల‌వ‌డం మాత్రం అంత ఈజీ కానే కాదు. గ‌న్న‌వ‌రం వైసీపీలో గ్రూపుల కుమ్ములాట‌లు ఎక్కువ‌. 2014లో వంశీ మీద పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావుది ఒక వర్గం కాగా.. 2019లో ఓడిన యార్లగడ్డ వెంకటరావుది ఇంకో గ్రూపు. మ‌ధ్య‌లో వంశీది మూడో ముఠా. వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లో వంశీకి టికెట్ ఇస్తే.. ఆ ఇద్ద‌రు ఎదురు తిర‌గ‌డం ఖాయం. అస‌లు వ‌ల్ల‌భ‌నేనికి టికెట్ రావ‌డం చాలా క‌ష్టం అంటున్నారు. ఒక‌వేళ వంశీనే పోటీ చేసినా.. ఆయ‌న్ను ఎలాగైనా ఓడించి తీరాల‌ని టీడీపీ పంతం ప‌ట్టింది. గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు, క‌మ్మ వ‌ర్గీయులు సైతం.. వంశీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు ఎన్నిక‌ల కోసం కాచుకూర్చున్నారు. అందుకే, ఈసారి గ‌న్న‌వ‌రం పోరు రంజుగా సాగ‌నుంద‌ని అంటున్నారు.

Related Posts