YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అవును.. నలుగురు కలిసిపోయారా

అవును.. నలుగురు కలిసిపోయారా

హైదరాబాద్, మార్చి 7,
కాంగ్రెస్ పార్టీలో ఆ నలుగురు కీలకం. రాజకీయం అంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది. కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కానీ.. ఎవరిదారి వాళ్లదే. కలిసి పనిచేస్తే చూడాలన్నది కేడర్‌ ఆశ. మారిన పరిస్థితుల్లో ఆ నలుగురు కలిశారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మనసులు కలిశాయా? మాటలే కలిశాయా? ఎవరా నాయకులు?పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి,  మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నాయకులు. కొన్నాళ్లుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఈ మధ్యే కలిసే ప్రయత్నం మొదలుపెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ నలుగురు ఒకే తాటిమీదకు వచ్చేస్తారని ఎవరికి వారు లెక్క లేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉండేది. తాజాగా ఇద్దరు నాయకులు భేటీ అయ్యి చాలా విషయాలు మాట్లాడేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి మరీ గంటన్నరపాటు చర్చలు జరిపారు రేవంత్‌. ఆ తర్వాత రేవంత్‌కిగానీ.. పార్టీకికానీ వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడింది లేదు. పైగా సింగరేణిలో అక్రమాలపై విచారణ జరపాలని ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తున్నారు. అయితే వెంకటరెడ్డి ఇలాగే ఉంటారా? లేక మళ్లీ మాట జారతారా అనే టెన్షన్‌ పార్టీ వర్గాల్లో లేకపోలేదు.ఇక రేవంత్‌, ఉత్తమ్‌లు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టే కనిపిస్తారు. కానీ.. ఇద్దరి రాజకీయ వ్యూహాలు వేరు. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విషయంలో ఉత్తమ్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డికి నచ్చ జెప్పే పనిలో ఉన్నారు కూడా. కొన్ని అంశాలపై ఇద్దరూ మాట్లాడుకుంటారు కానీ.. ఎవరి వ్యూహాలు వారివే. ఇద్దరూ బాహాటంగా విమర్శలు చేసుకోరు. ఎవరి లెక్కలు వారివే. ఉత్తమ్‌ పీసీసీ చీఫ్‌గా చేసి ఉండటంతో కాంగ్రెస్‌లో చాలా మంది నాయకులు ఆయనతో టచ్‌లో ఉన్నారు. ప్రస్తుతం రేవంత్‌, ఉత్తమ్‌ కలిసి ఉన్నారా? లేదా అన్నది గాంధీభవన్‌ వర్గాలకే అంతుచిక్కదు.అదేవిధంగా రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క మధ్య థిక్‌ ఫ్రెండ్‌షిప్‌ అయితే లేదు. పార్టీ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య సంప్రదింపులు ఉంటాయి. ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి చేస్తున్న పాదయాత్రకు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ మద్దతు పలికారట. సాధారణంగా పార్టీలో సొంత నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తే పెద్ద రచ్చ అవుతుంది. భట్టి యాత్రపై గాంధీభవన్‌ నుంచి ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు.ప్రస్తుతం భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, రేవంత్‌లు ఒకరి అభిప్రాయాలు మరొకరు షేర్‌ చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరగడంతో..ఆ విషయంపై ఉత్తమ్‌ మాట్లాడతారని చెప్పారు రేవంత్‌. అలాగే భట్టి పాదయాత్ర విషయంలో గాంధీభవన్‌ నుంచి డైలీ పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌లు, యాత్ర అప్‌డేట్స్‌ మీడియాలో సమన్వయం చేసుకోవాలని పీసీసీ చీఫ్‌ నుంచి పీఆర్వోకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి ఎవరు ఏ మంత్రం వేశారో.. లేక వాళ్లే తెలుసుకున్నారో కానీ.. నేతలు సంయమనం పాటించడం మొదలైంది. మరి..ఈ ఐక్యతారాగం బలపడుతుందో.. మధ్యలోనే పాత కాంగ్రెస్‌ను పరిచయం చేస్తారో చూడాలి.

Related Posts