YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నవంబర్ లో ముందస్తు ముహూర్తం

నవంబర్ లో ముందస్తు ముహూర్తం

హైదరాబాద్ , మార్చి 12,
ఉన్న‌ట్టుండి కేసీఆర్ మ‌న‌సు మారిందా? ఏడేళ్లుగా లేనిది నిరుద్యోగుల‌పై ఒక్క‌సారిగా ప్రేమ కురిసిందా? 91 వేల ఉద్యోగాలంటే మాట‌లా? ఎవ‌రూ అడ‌క్కుండానే.. ఉద్య‌మాలు, పోరాటాలు గ‌ట్రా జ‌ర‌క్కుండానే.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి లేకుండానే.. ఓయూ ర‌ణ‌రంగం కాకుండానే.. కేసీఆర్ దిగొచ్చి.. ఇలా భారీ సంఖ్య‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాలు ప్ర‌క‌టించ‌డం మామూలు విష‌యం మాత్రం కాదు. ఆ ఉద్యోగాల‌న్నీ ఇస్తారా? ఇవ్వ‌రా?  కోర్టులో కేసులు వేయించి అడ్డుకుంటారా?  నియామ‌కాలు ఇవ్వ‌కుండా ఆల‌స్యం చేస్తారా? ఇలాంటివ‌న్నీ త‌ర్వాతి విష‌యాలు. ప్ర‌స్తుతం మాత్రం నోటిఫికేష‌న్లు ఇచ్చేశారు.. అదే గొప్ప‌. రాజకీయ లాభం లేనిదే.. కేసీఆర్ ఏ ప‌నీ చేయ‌డంటారు. అలాంటిది ఉత్తిపుణ్యానికే 91వేల ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వ‌నే ఇవ్వ‌రు అంటున్నారు. మ‌రి, ఎందుకు ఇచ్చిన‌ట్టు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇంకెందుకు.. త్వ‌ర‌లో ముంద‌స్తుకు వెళ్తున్నారంటూ విశ్లేష‌ణ మొద‌లైపోయింది. అవును, సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముంద‌స్తు యోచ‌న‌లో ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో తెలంగాణ‌కు ఎన్నిక‌లు రాబోతున్నాయంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. ఎల‌క్ష‌న్స్‌కు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్ శ్రేణుల‌ను ప్రిపేర్ చేస్తున్నారు. రేవంత్ అంచ‌నా క‌రెక్ట్ అనే అంటున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లోనే అసెంబ్లీ ర‌ద్దు చేస్తార‌ని.. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు గ‌డువు ఉంటుంది కాబ‌ట్టి.. క‌ర్నాట‌క ఎల‌క్ష‌న్స్‌తో క‌లిపి మార్చి-ఏప్రిల్‌లో తెలంగాణ‌లోనూ ఎన్నిక‌ల న‌గారా మోగుతుంద‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఢిల్లీ వ‌ర్గాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే.. తెలంగాణ‌లో అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. కేసీఆర్‌కు ఘోర ప‌రాజ‌యం ఖాయం. టీఆర్ఎస్ స‌ర్కారుపై అన్నివ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నా.. అంద‌రికంటే నిరుద్యోగులు కేసీఆర్‌పై బాగా ర‌గిలిపోతున్నారు. ఏడేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు లేక అల‌మ‌టిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన నిరుద్యోగ భృతి అయినా ఇస్తార‌నుకుంటే అదీ లేదు. అందుకే, ఎన్నిక‌లొస్తే నిరుద్యోగులు కేసీఆర్‌కు క‌ర్రు కాల్చి వాత‌పెట్ట‌డం ఖాయ‌మ‌నే విష‌యం గుర్తించే హ‌డావుడిగా నోటిఫికేష‌న్లు ఇచ్చేశార‌ని అంటున్నారు. ఎలాంటి అడ్డంకులు లేక‌పోతే.. వ‌చ్చే 6 నెల‌లు నియామ‌కాల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. అలా, నిరుద్యోగుల‌ను కూల్ చేసి.. న‌వంబ‌ర్‌లో అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న అని తెలుస్తోంది. మ‌రి, 10 ల‌క్ష‌ల‌కు పైగా నిరుద్యోగులు ఉంటే.. 80 వేల ఉద్యోగాలు ఇస్తే.. నిరుద్యోగ భృతి ఊసే లేక‌పోతే.. కేసీఆర్‌ను ఎలా గెలిపిస్తార‌ని అనుకుంటున్నారో ఏమో.. ఈ న‌వంబ‌ర్ అయినా.. వ‌చ్చే న‌వంబ‌ర్ అయినా.. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా.. కేసీఆర్‌కు ప‌రాజ‌యం.. ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని తేల్చిచెబుతున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు.

Related Posts