
నల్గొండ, మార్చి 24,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని నేరుగా టార్గెట్ చేశారు మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ ఓ దొంగల పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వందల ఎకరాలు సంపాదించాడని.. కోట్ల రూపాయలతో బంగ్లాలు, ఆస్తులు పెంచుకున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.నకిరేకల్ నియోజకవర్గంలో కాలినడకన తిరిగిన ఆయన సీఎం కేసీఆర్‌ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందాయా? అని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో నేటికీ కనీస వసతులు లేవని.. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండలో ఏళ్ల తరబడి పనిచేసినా పేదోళ్ల బతుకులు మారడం లేదని.. ఈ దోపిడీ రాజ్యాన్ని తరిమికొట్టి బహుజన రాజ్యం తెచ్చుకుందామని ఆయన అన్నారు.
గతంతో గురుకులాల సంస్థ సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఆరున్నరేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన నినాదంతో ఆయన బీఎస్పీలో చేరారు. రాజ్యాధికారం ద్వారానే వెనకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆయన చెబుతారు. ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చిన ప్రవీణ్ నేరుగా టార్గెట్ చేయడం.. అందులోనూ ఓ మాజీ ఐపీఎస్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.