YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరువు తీస్తున్న పీఏలు

పరువు తీస్తున్న పీఏలు

అనంతపురం, మార్చి  28,
బాలయ్య. నటనను ప్రాణంగా ప్రేమిస్తారు. వయస్సు మీద పడినా.. హీరోయిజం చూపించే పాత్రలు చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. నటనకు ఎంత ప్రయారిటీ ఇస్తారో.. జాతకాలు.. ముహూర్తాలు, దోషాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ముహూర్తం లేందే ఏ పనీ చేయరు. కాలు బయట పెట్టరు. ముహూర్తాలపై అంతలా నమ్మకం పెట్టే బాలయ్యకు పాపం.. పీఏల రూపంలో గండాలు ఎదురవుతున్నాయి. తలనొప్పులు తప్పడం లేదు.బాలకృష్ణ.. సినిమాల్లో ఎంత పవర్‌ఫుల్‌ యాక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన సక్సెస్‌ను ఎవరూ ఆపలేకపోయారు. హిందూపురం నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్‌ సృష్టించారు. గాలివాటం నాయకుడిగా కాకుండా.. కేడర్‌కు అందుబాటులో ఉండటం.. ఎప్పటికప్పుడు హిందూపురం సమస్యలపై అప్‌డేట్‌గా ఉంటారు. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో కూడా ఆయన గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. దీనికి బాలకృష్ణ ఇమేజే అని చెప్పాలి. రాజకీయాలు.. సినిమాలు బ్యాలెన్స్‌ చేసుకుని వెళ్తుంటారు. ఆయన ఎక్కడ ఉన్నా హిందూపురంపై ఫోకస్‌ ఉంటుంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటిమీద ఫోకస్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తారు బాలయ్య. జనంతో సమస్యలు లేని బాలయ్యకు ఇప్పుడు తన సొంత మనుషులతో సమస్యలు వచ్చి పడ్డాయి. బాలయ్యకు అన్నీ కలిసి వస్తున్నాయి కానీ పీఏలు కలిసి రావడం లేదు. పీఏలు ఎప్పటికప్పుడు ఆయనకు తలనొప్పిగా మారారు.ఎమ్మెల్యేగా బాలకృష్ణ హిందూపురంలో లేని సమయంలో అక్కడ పార్టీ వ్యవహారాలను పీఏలు చక్కబెడుతుంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలయ్య పీఏగా ఉన్న శేఖర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారారు. ఎన్నోసార్లు ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు కేడర్‌. చివరకు సొంతపార్టీ నాయకులే శేఖర్‌కు వ్యతిరేకంగా ఆనాడు ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగ విమర్శలు చేశారు కూడా. ఆ గొడవ అప్పట్లో చంద్రబాబు వరకు వెళ్లింది. మొదట్లో ఆ ఆరోపణలను లైట్‌ తీసుకున్న బాలయ్య.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పీఏ శేఖర్‌ను తప్పించేశారు.శేఖర్‌ తర్వాత సీన్‌లోకి పీఏగా టీచర్‌గా పనిచేస్తున్న బాలాజీ వచ్చారు. తొలిరోజుల్లో బాలాజీ బాగానే కనిపించినా.. మెల్లగా ఆయనది కూడా సేమ్‌ సీన్‌ అయ్యింది. మళ్లీ విమర్శలు రావడంతో బాలాజీని సాగనంపారు బాలయ్య. అయితే 2019లో మళ్లీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచాక తిరిగి బాలాజీనే పీఏగా పెట్టుకున్నారు. అప్పుడు కూడా బాలాజీ నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలకు పీఏతో పెద్దగా పని లేకపోవడమే కారణం. అయితే తాజాగా పీఏ బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అది కూడా ఏపీలో కాకుండా హిందూపురానికి సమీపంలో ఉన్న కర్ణాటక గౌరిబిదునూరులోని నగిరిగెర బీఎన్‌ఆర్‌ రెస్టారెంట్‌లో పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో బాలయ్య పీఏ బాలాజీతోపాటు 19 మంది పేకాటరాయుళ్లును అరెస్ట్‌ చేశారు.ఏపీలో పేకాట ఆడితే పోలీసులు టార్గెట్‌ చేస్తారని అనుకున్నారో ఏమో.. సేఫ్‌ ప్లేస్‌గా బోర్డర్‌లో ఉన్న కర్ణాటకను అడ్డగా చేసుకున్నారు బాలాజీ. మరి.. కర్నాటక పోలీసులే స్వయంగా దాడి చేశారో లేక.. AP పోలీసులు ఉప్పందించారో కానీ రైడ్‌ జరిగింది. బాలకృష్ణ పీఏ దొరికిపోయారు. ఇక్కడ పోలీసులకు చిక్కింది బాలాజీనే అయినా.. బాలకృష్ణ పీఏ పట్టుబడ్డారన్నదే రచ్చ రచ్చ అయింది. ఇప్పటికే పీఏలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలయ్య.. తాజా వివాదంతో బాలాజీని కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Posts