
అదిలాబాద్, మార్చి 28,
ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది అధికార టీఆర్ఎస్. ఇంఛార్జ్ మంత్రి పిలుపుతో ఎమ్మెల్యేలు వెంటనే కార్యాచరణలోకి దిగిపోయారు. కార్యక్రమంలో పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను భాగస్వామ్యం చేద్దామని అనుకున్నారు శాసనసభ్యులు. పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడికక్కడ మెసేజ్‌లు పెట్టేశారు. తండోప తండాలుగా వచ్చేస్తారని భావించి.. ఫంక్షన్ హాళ్లలో భారీ ఏర్పాట్లు చేశారు. కానీ.. పావు వంతు కుర్చీలు కూడా నిండ లేదు. ఫోన్లు చేసి కేడర్‌ను పిలవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలు వేడుకోవడం కనిపించిందినిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ కేడర్ రాలేదు. అక్కడ టీఆర్ఎస్‌లో ఉన్న గ్రూప్‌వార్ కారణంగా కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయని చెబుతున్నారు. సభలో ఖాళీ చైర్స్‌ను చూసిన మంత్రి పార్టీ నేతలపై కస్సుమన్నారట. ఇంతలోనే మంత్రి సభలో ఖాళీ కుర్చీలంటూ వీడియోలు బయటకు రావడంతో.. స్థానికంగా సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న సమయంలో నియోజకవర్గంలో పరిస్థితిని చూసి కంగుతింటున్నారట ఎమ్మెల్యేలు. ఇన్నాళ్లూ ఒక పిలుపిస్తే వచ్చే పార్టీ కేడర్.. ఇప్పుడు రాకపోవడంతో కలవరపడుతున్నారట. కేడర్‌తో ఎక్కడ గ్యాప్ వచ్చింది? లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసే పనిలో పడ్డారట ఎమ్మెల్యేలు. సమస్యను వెంటనే సర్దుబాటు చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అవుతుందని.. సన్నాహక సమావేశాల పరిస్థితి చూశాక ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లోకల్ ప్రజాప్రతినిధులకు పడటం లేదు. వర్గాలుగా విడిపోయారు. బోథ్‌లో రచ్చకెక్కిన గ్రూప్‌వార్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం తెలిసినా.. ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. ఇప్పుడు సమావేశంలో ఖాళీ కుర్చీలు కనిపించే సరికి నూటొకటి కొట్టిందట. ఆదిలాబాద్‌లో రోజాంతా ఎదురు చూసినా టీఆర్ఎస్ కేడర్ రాకపోవడం చర్చగా మారింది. మరి.. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యేలు.. అధికారపార్టీ నేతలు కేడర్‌కు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.