
హైదరాబాద్, మార్చి 28,
తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొంతకాలంగా సైలెంట్. హైకమాండ్ పిలుపిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా కనిపించడ లేదు. గతంలో పార్టీ తరఫున చేపట్టిన నిరసనల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. సడెన్‌గా సైలెంట్ కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారిపోయారు. గత పీసీసీ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు పొన్నం. పీసీసీకి కొత్త టీమ్ వచ్చాక దూకుడు తగ్గించడంతోపాటు.. చప్పుడు చేయకపోవడం రకరకాల అనుమానాలకు.. ఊహాగానాలకు తావిస్తోందట.హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలోనే పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని ఆయన ఖండించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత లక్ష్మీనరసింహారావు గులాబీ గూటికి వెళ్తూ పొన్నంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వివాదమో లేక.. పార్టీలో గుర్తింపు లేదన్న బాధో ఏమో కాంగ్రెస్‌తో అంటీముట్టన్నట్టు ఉంటున్నారట పొన్నం. కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు సరే..! టీఆర్ఎస్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నుంచి విమర్శల జడి లేదు. గతంలోలా ఎలాంటి కామెంట్స్ లేవు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నా.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉలుకు పలుకు లేదు. ఒకప్పుడు జిల్లాలో పార్టీ నుంచి ఆయన వాయిస్ వినిపించేది. ఇప్పుడు హస్తానికి వాయిస్సే లేకుండా పోయింది.హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర ఓటమితో.. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ పరాజయాలపై సమీక్ష చేయాలని హైకమాండ్‌కు లేఖ రాశారు పొన్నం. కాంగ్రెస్‌లో చాలామంది టీఆర్‌ఎస్ కోవర్టులు ఉన్నారన్నది ఆయన ఆరోపణ. కానీ.. పొన్నమే టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని కొందరు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లు అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్నారు. వాళ్లతోనూ పొన్నం కలవడం లేదు.ఇదే సమయంలో కాంగ్రెస్‌లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఎంపీగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన నాయకుడికి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నది కొందరి వాదన. కొత్త కమిటీలో చోటు ఇవ్వలేదు. పార్టీ గుర్తిస్తుందో.. విస్మరిస్తుందో పొన్నం అనుచరులకు తెలియడం లేదట. పార్టీలో సముచిత స్థానం కల్పించని కారణంగానే మాజీ ఎంపీ మౌనంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. కానీ.. సరైన సమయంలో మళ్లీ క్రియాశీలకం అవుతారనే ఆలోచనలో ఉన్నారు. మరి.. ఈ మౌనానికి కారణం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెబుతారో లేదో చూడాలి.