అదిలాబాద్, మార్చి 28,
వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ట్రిపుల్ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ లేరు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు.ల్యాబ్ అసిస్టెంట్ తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొంది. వేలాది మంది విద్యార్థులన్న ఈ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ కొనసాగుతుండటం ఆశ్చర్యమేస్తోంది. విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాల్లేవు. రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్నారు. ఫ్యాన్లు లేవు. ఏసీ పని చేయడం లేదు. కుర్చీలు డిజిటల్ బోర్డ్స్, డెస్క్ లన్నీ చెడిపోయాయి. ప్రొజెక్టర్ అసలు పనిచేయడం లేదన్నారు.మండుటెండలో రేకుల షెడ్లలో ఫ్యాన్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడిపోతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడం లేదు. కనీసం యూనిఫాం, షూ, ఐడీ కార్డులు కూడా ఇవ్వడం లేదంటే ట్రిపుల్ ఐటీ ఎంతటి దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక హాస్టల్ లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. వాడిపారేసిన పాత పరుపులే దిక్కు. 9 వేల మంది విద్యార్థులకు మూడు మెస్ లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అత్యంత దరిద్రంగా మారాయి.వేలాది మంది పిల్లలు ఒకేసారి భోజనం చేయాల్సి రావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారింది. చదువుకునే వారంతా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం వారేకదా వాళ్లు ఏ భోజనం పెట్టినా అడిగే వారెవరు ఉండరనే నిర్లక్ష్యం మెస్ నిర్వాహకుల్లో కన్పిస్తోందన్నారు. అందుకే వారు వడ్డించే భోజనంలో తెల్ల పురుగులు, కప్పలు కన్పించడం నిత్యకృత్యంగా మారిందన్నారు.తాగడానికి మంచి నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. పురాతనమైన వాటర్ ఫిల్టర్ నిర్వహణ కూడా సరిగా లేదు. హాస్టల్ లో శుభ్రత కరువైంది. దోమలు, ఈగలు, పురుగులతోనే విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ఫీజుల ద్వారా ఏటా 40 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నా విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం.ట్రిపుల్ ఐటీ దుస్థితిని చూస్తుంటే వేలాది మంది విద్యార్థులు భవిష్యత్ ఏమవుతుందోననే ఆవేదన కలుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించరానిది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రెగ్యులర్ వీసీ, డైరెక్టర్ తోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు ఎంపీ సోయం బాపూరావు.