YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిట్టింగులకు సీట్లు గల్లంతేనా

సిట్టింగులకు సీట్లు గల్లంతేనా

హైదరాబాద్, ఏప్రిల్ 26,
గత ఎన్నిక‌ల్లో ఐదుగురు మిన‌హా సిట్టింగ్స్ అంద‌రికీ టికెట్లు ఇచ్చేశారు కేసీఆర్‌. అందులో చాలామంది మ‌ళ్లీ గెలిచేశారు. ఆనాడు ఆయ‌న‌పై ఆయ‌న‌కు ఉన్న న‌మ్మ‌కం అలాంటిది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా.. కేసీఆర్‌ను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అన్న‌ట్టుగా ఉన్నారు జ‌నాలు. ఇదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి నాయ‌కత్వంలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఇక బీజేపీ దూకుడుకైతే ప‌గ్గాలే లేవు. అందుకే, ఈసారి కారు పార్టీకి విజ‌యం హైవే మీద డ్రైవింగ్‌లా ఉండ‌క‌పోవ‌చ్చు. చెక్‌పోస్ట్‌లు, టోల్‌గేట్లు.. కారు స్పీడుకు బ్రేకులు వేస్తాయంటున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండ‌టంతో.. అహంకారం బాగా పెరిగింద‌ని అంటున్నారు. అవినీతి, అక్ర‌మాలు, అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు, గ్రూపుల‌తో జిల్లాల్లో కారు పార్టీకి తుప్పుప‌ట్టింద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల టీఆర్ఎస్ నేత‌ల అరాచ‌కాలు వ‌రుస‌గా వెలుగు చూస్తుండ‌టం అందులో భాగ‌మే. ఖ‌మ్మం జిల్లాలో వ‌న‌మా కుమారుడి ఎపిసోడ్ నుంచి.. రామాయంపేట‌లో త‌ల్లి, కొడుకుల సూసైడ్ వ‌ర‌కూ.. టీఆర్ఎస్ నేత‌ల‌ దారుణాలు వెలుగు చూస్తుండ‌టంతో ఆ పార్టీ ప‌ని పోయిన‌ట్టే..అంటున్నారు. ఈ మాట‌ల‌న్నీ అంటున్న‌ది మ‌రెవ‌రో కాదు.. స్వ‌యంగా పీకేనే. అవును, ఆయ‌న టీమ్ ఐప్యాక్ చేసిన స‌ర్వేలో ఈ విష‌యాల‌న్నీ తెలిశాయ‌ని.. ఆ వివ‌రాల‌ను ప్ర‌శాంత్ కిశోర్ స్వ‌యంగా సీఎం కేసీఆర్‌కు వివ‌రించార‌ని తెలుస్తోంది. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేత‌లు ఇంత‌లా రెచ్చిపోవ‌డానికి కార‌ణం ఏంటో కూడా చెప్పార‌ట ప్ర‌శాంత్ కిశోర్‌. మ‌రోసారి కూడా సిట్టింగ్స్ అయిన త‌మ‌కే టికెట్ ఇస్తార‌నే ధీమానే వార‌లా రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మ‌ట‌. తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త వ‌ల్ల‌.. ఈసారి కూడా సిట్టింగ్స్ అంద‌రికీ ఇంకో ఛాన్స్ ఇస్తే.. అందులో చాలామంది చిత్తుచిత్తుగా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఐప్యాక్ స‌ర్వేలో తేలింద‌ని సీఎం చెవిలో వేశార‌ట పీకే. అందుకే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చేయాల‌ని.. లేదంటే తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని.. ఏయే చోట్ల కేండిడేట్స్‌ను మార్చాలో కూడా ఓ లిస్ట్ త‌యారు చేసి.. కేసీఆర్‌కు పీకే స‌మ‌గ్ర నివేదిక అందించార‌ని తెలుస్తోంది.కొందరు ఎమ్మెల్యేల తీరు మ‌రీ దారుణంగా ఉంద‌ని ఐప్యాక్ స‌ర్వేలో తెలిసింద‌ట‌. ఖ‌మ్మం జిల్లాలో గ్రూప్ వార్ బాగా ముదిరిపోయి గులాబీ రేకులు రాలిపోతున్నాయ‌ని తేలింద‌ట‌. ఇక‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయిస్తూ, మరో పార్టీలోకి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారనే అంశాన్ని కేసీఆర్‌కు ఉదహరించార‌ని స‌మాచారం. ఇలాంటి పార్టీ వ్య‌తిరేక‌ య‌వ్వారాలు.. అనేక‌ జిల్లాల్లో జ‌రుగుతున్నాయ‌ని.. ఇప్పుడే జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే.. అస‌లుకే మోసం జ‌రుగుతుంద‌ని గులాబీబాస్‌కు పీకే వివ‌రించార‌ని అంటున్నారు. సో.. ప్ర‌శాంత్ కిశోర్ నివేదిక‌ను బ‌ట్టి చూస్తే.. ఈసారి చాలా మంది సిట్టింగ్‌ల సీట్ల‌కు ఎస‌రు త‌ప్పేలా లేదంటున్నారు.

Related Posts