YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొత్తుల పంచాయితీ

పొత్తుల పంచాయితీ

విజయవాడ, మే 13,
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా అప్పుడే పొత్తుల పంచాయితీ కాకరేపుతోంది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ వైసీపీ కాలుదువ్వుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాయి. దమ్ముంటే ఒంటరిగా పోటీకి రావాలని జగన్ పార్టీ సవాల్ చేస్తోంటే.. ఎలా రావాలో మాకు తెలుసంటూ దీటుగానే బదులిచ్చాయి. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చంటూ సంకేతాలు కూడా ఇచ్చేశాయి. జగన్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఉత్తరాంధ్ర పర్యటనతో అది తేలిపోయిందని చంద్రబాబు స్పష్టం చేశారు. అరాచకపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు అందరూ కలిసి రావాల్సి అవసరం ఉందంటూ పాతమిత్రులకు మరోమారు స్నేహహస్తం చాటారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే రాష్ట్రంలో అంధకారమేనంటూ వ్యాఖ్యలు చేయడం.. పొత్తులపై మరింత ఆసక్తి రేపుతోంది గతంలో గ్రాండ్ సక్సెస్.. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన బరిలో దిగనప్పటికీ బయటి నుంచి మద్దతునిచ్చింది. ఆ ఎన్నికల్లో భారీ అంచనాలతో ఒంటరిగానే బరిలోకి దిగిన వైఎస్ జగన్ పార్టీ పరిస్థితి తల్లకిందులైంది. జగన్ గెలవబోతున్నారంటూ సర్వేలు గగ్గోలు పెట్టినా అనూహ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించి అబ్బురపరిచింది. టీడీపీ అధినేత అనుభవం, రుణమాఫీ వంటి హామీలు చివరి క్షణాల్లో సీన్ మార్చేశాయన్న విశ్లేషణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే టీడీపీకి తన మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో చెడింది. పసుపు పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా కాషాయం పార్టీని టార్గెట్ చేయడం కమలనాథులకు మింగుడుపడలేదు. గత ఎన్నికల్లో తమ విజయానికి సాయం చేసిన పవన్‌ను సైతం పట్టించుకోకపోవడంతో ఆయన కూడా దూరమయ్యారు.  వైసీపీ అధినేత జగన్ మరింత కసిగా ఫోకస్ పెట్టారు. భారీ పాదయాత్ర చేపట్టి ఊరూరా తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఒక్క అవకాశంటూ అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగారు. రెండోసారీ భారీ అంచనాలతోనే బరిలోకి దిగిన వైసీపీ ఈ సారి తన లక్ష్యాన్ని ఛేదించింది. పాత రికార్డులను బద్దలుకొడుతూ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఏకంగా 151 సీట్లతో అధికార పీఠం దక్కించుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా ఒంటరిగా బరిలోకి దిగడం వైఎస్ జగన్‌కు కలిసొచ్చింది. వైసీపీ విజయం ఖాయమని అంచనాలు ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన దోస్తీ బెడిసికొట్టడంతో మరింత కలిసొచ్చిందనే వాదనలున్నాయి. . ఇక ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి. అధికార పక్షంగా బరిలోకి దిగిన టీడీపీ 2019 ఎన్నికల్లో చావు దెబ్బతింది. వ్యతిరేక ఓటు వైసీపీ ఖాతాలో నేరుగా పడినప్పటికీ.. బలంగా ఉన్న స్థానాల్లోనూ తెలుగుదేశం విజయం సాధించలేకపోయింది. జనసేన పార్టీ టీడీపీ విజయావకాశాలను దెబ్బతీసింది. ఒకే ఒక్క సీటుతో అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన జనసేన చాలా స్థానాల్లో 30 నుంచి 50 వేల ఓట్ల వరకూ దక్కించుకుంది. టీడీపీ అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాల్లో జనసేనకు భారీగా ఓట్లు పోలవడం గమనార్హం. ఒకవేళ పాతమిత్రులుకలిసి పోటీ చేసి ఉంటే అంత ఘోరంగా విఫలమయ్యేవారు కాదేమో గత ఎన్నికల ఫలితాలతో కాస్త ముందుగానే మేల్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ రాజేశారు. జగన్ సర్కార్‌పై ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ వ్యూహాల్లో తలపండిన చంద్రబాబు కలిసి నడుద్దామంటూ ముందే ఓ మెట్టు దిగారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన అవసరముందని నొక్కిచెప్పడం ద్వారా పొత్తులు అనివార్యమనే సంకేతాలిచ్చారు. గతంలోనూ ఒకరే ప్రేమిస్తే కుదరదు.. అవతలి వాళ్లు కూడా ప్రేమించాలంటూ పొత్తులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి స్పందించారు. పొత్తులకు సిద్ధమని చెప్పకుండానే ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ డబుల్ స్ట్రాటజీ.. అయితే అధికార వైసీపీ మాత్రం విపక్షాలపై కాలుదువ్వడమే వ్యూహంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పటికీ.. ప్రతిపక్షాలను ఒక్కటి కానివ్వకూడదనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పవన్‌ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ ప్రచారం చేస్తోంది. ఇద్దరూ ఒక్కటేనని బలమైన ముద్ర వేసేందుకు యత్నిస్తోంది. ఇద్దరూ వేర్వేరుగా ఉంటే మంచిది.. కలిసిపోతే మరీ మంచిదనే దిశగా పావులు కదుపుతోంది. టీడీపీ, జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం. అదే జరిగితే వైసీపీ సేఫ్. ఒకవేళ టీడీపీ, జనసేన జతకడితే ఇద్దరూ కలిసి మరోమారు మోసం చేసేందుకు వస్తున్నారనే పాత నినాదంతోనే చెక్ పెట్టాలని వైసీపీ డబుల్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts