YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమల దళంలో కవర్ కల్చర్

కమల దళంలో  కవర్ కల్చర్

న్యూఢిల్లీ, మే 16,
అప్పుడు అది కాంగ్రెస్ కల్చర్. ముఖ్యమంత్రులను బొమ్మల కొలువులో బొమ్మలు మార్చినట్లు మార్చడం కాంగ్రెస్ కల్చర్’గా ఉండేది. చెన్నారెడ్డి, కోట్ల వంటి ఉద్దండ నాయకులను కూడా, చిటికేసి సీఎం కుర్చీ దించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, అప్పటి కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రులను ఇష్టారాజ్యంగా మార్చింది.అంజయ్యను అయితే   అత్యంత అవమానకారంగా సాగనంపింది. ఈ నేపధ్యంలోనే, తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ‘తెలుగు దేశం పార్టీ’ ఆవిర్భవించింది. పదకొండు నెలలు తిరగకుండానే,ఎన్టీఆర్’ ను అందలం ఎక్కించింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్’లోనే కాదు. ఇంకా అనేక రాష్ట్రాల్లో ‘సీల్డ్ కవర్’ వర్తమానంతో ముఖ్యమంత్రులను మార్చిన సందర్బాలు కాంగ్రెస్ చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ కథ... కంచికి చేరిన నేపధ్యంలో, ముఖ్యమంత్రులను ఇష్టారాజ్యంగా సాగనంపే కల్చర్’ను బీజేపీ  సొంత చేసుకుందా అంటే అవుననే అనవలసి వస్తోందని పరిశీలకులు, పార్టీ పెద్దలుఅంటున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజీపీ, ఉత్తరాఖండ్’లో ఒక్క సంవత్సరంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. అయినా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.  ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే ఉత్తరాఖండ్ సంప్రదాయానికి తెరదించుతూ మొత్తం 70 స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 46కి పైగా సీట్లలో విజయం సాధించింది. అయితే, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సొంత నియోజక వర్గంలో ఓడిపోయారు, అనుకోండి అది వేరే విషయం. అదే సమయంలో పంజాబ్’లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిని మార్చింది కానీ,అక్కడ అది  వర్కౌట్ కాలేదు.అలాగే, బీజేపీ కర్ణాటకలోనూ ఆరు నెలలల క్రితం యడియూరప్పను సాగనంపి, బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసింది. అదలా ఉంటే, మరో వంక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో బీజేపీ అధిష్టానం మరోమారు నాయకత్వ మార్పు ఆలోచన చేస్తోందనే వార్తలు విన్పిస్తున్నాయి.సరే, ఆ విషయాన్ని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలోనూ బీజేపీ అధినాయకత్వం రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్’ కు ఉద్వాసన పలికింది. బిప్లబ్ కుమార్ దేబ్’ను ఢిల్లీకి పిలిపించిన బీజేపీ పెద్దలు ఆయన్ని రాజీనామా చేయమని ఆదేశించారు. అంతే, అయన మరో మాట లేకుండా గవర్నర్’కు రాజీనామా సమర్పించారు. మరో వంక అంతే  వేగంగా అయన స్థానంలో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా వున్న మాణిక్ సాహాను బీజేపీ అధిష్టానం రాష్ట్ర  కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించింది. త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్ట్ పాలనకు తెరదించుతూ 2018లో బీజేపీ అధికారాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా బిప్లబ్ కుమార్ దేబ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. సొంత పార్టీలోనూ బిప్లబ్ కుమార్ దేబ్ పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరిగి పతాక స్థాయికి చేరడంతో బీజేపీ అధిష్టానం ఆయనకు ఉద్వాసన పలికింది. అయితే, ఇల్లు అలకగానే, పండగ రాదని. గత నాలుగు సంవత్సరాలలో బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన డ్యామేజిని చెరిపేయడం అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ కల్చర్’తో పాటు, ‘సీల్డ్ కవర్’ కల్చర్ కూడా బీజేపీ సొంతం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Related Posts