YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకతో పోటీ తెలంగాణ ఎన్నికలు..?

కర్ణాటకతో పోటీ తెలంగాణ ఎన్నికలు..?

న్యూఢిల్లీ, జూలై 28,
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడి రాజుకుంటోంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ స్పీడును పెంచాయి. ఓ వైపు భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద ముంపు బాధితులు సాయం కోసం ధైన్యంగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న కుండపోతతో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గరుండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించించాల్సిన ముఖ్యమంత్రి హుటాహుటీనా హస్తీనకు వెళ్లడం.. అక్కడే మకాం వేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో అసలేం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. 2018 తరహాలోనే ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని ఇప్పటికే పీకే సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేసేందుకు కేసీఆర్ లెక్కలు అన్ని వేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు ప్రస్తుత టీఆర్ఎస్ సర్కార్ కు గడువు ఉంది. అయితే గడువు వరకు ఆగితే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. గత అనుభవం దృష్ట్యా పార్లమెంట్‌కు అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు జరిగితే అది మొదటికే ప్రమాదం అనే విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ముందస్తుకు వెళ్లడం దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ రద్దు ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది.ఓ వైపు కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగానే మరో వైపు ప్రశాంత్ కిశోర్ టాపిక్ మరోసారి తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారుతోంది.మూడో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పలు సర్వేలు చేయించుకుంటోందన్నది బహిరంగ రహస్యమే. ఆయా అంశాల వారీగా పలు నివేదికలను పీకే టీమ్ ద్వారా కేసీఆర్ సర్వే చేయించి తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ వాస్తవ పరిస్థితి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, వారి పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం వంటి అంశాలపై కేసీఆర్ నివేదికలను తెప్పించుకున్నారనే టాక్ తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు జోరు పెంచిన నేపథ్యంలో ఇక తన పనిని స్పీడర్ చేయాలని పీకేకు కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రజల అభీష్టం, భవిష్యత్ కార్యచరణపై తుది నివేదిక ఇచ్చే పనిలో పీకే టీమ్ బీజీ బీజీగా ఉందట. ముందస్తు ఎన్నికలకు పార్టీ నిర్ణయం తీసుకునే వీలుగా ఆగస్టులోగా అన్ని అంశాలపై ఫైనల్ రిపోర్ట్ కార్డు ఇచ్చేలా పీకే పనిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.సాధారణంగా అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత 6 నెలల్లోపు తిరిగి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఒక వేళ అదే సమయంలో ఇతర రాష్ట్రాల అసెంబ్లీకి, లోక్ సభ ఎన్నికలు ఉంటే వాటితో కలిసి ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీకి, 2023 మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రాష్ట్రంతో కలిసి ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గుజరాత్ తో ఎన్నికలకు వెళ్లాలంటే నెలాఖరులోపు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటకతో పాటు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఉంది. అక్కడ బీజేపీ టఫ్ ఫైట్ ఎదుర్కోనుంది. సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కర్ణాటకనే కావడంతో అక్కడ బీజేపీ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోదనేది విశ్లేషకుల అభిప్రాయం. కర్ణాటకతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేసుకుంటే బీజేపీ అగ్రనేతల దృష్టి కర్ణాటకతో పాటు తెలంగాణపై పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్ కొంతలో కొంత మేర తగ్గించవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. అందువల్ల ఈ యేడాది డిసెంబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేసుకునే అవకాశాలే ఎక్కువ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ముందుస్తుకు వెళ్లేది లేదని.. గడువు వరకు ప్రభుత్వం కొనసాగుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతునప్పటికీ అలా జరగదనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాజకీయ వ్యూహరచనల్లో తన కుడి కాలు వేసే అడుగు ఎడమ కాలికి కూడా తెలియనీయడనే టాక్ ఉన్న కేసీఆర్.. మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Related Posts