YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హోటల్ రూమ్స్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హోటల్ రూమ్స్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత కర్ణాటకలో మొదలైన నాటకీయ పరిణామాలకు ఇంకా తెరపడలేదు. బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో తరఫున కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటక కొత్త సీఎంగా కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేయనుండగా, గురువారం ఆయన బలం నిరూపించుకోనున్నారు. అయితే ఎమ్మెల్యేలు గురువారం దాకా శిబిరాల్లో ఉండాలని ఇరు పార్టీలు ఆదేశించాయి. ఆదివారం ఉదయమే ఎమ్మెల్యేలను తమ తమ స్వస్థలాలకు పంపాలని కాంగ్రెస్- జేడీఎస్లు భావించినా చివరి నిమిషంలో దీన్ని విరుమించుకున్నారు. బీజేపీ తమ సభ్యులకు ఇంకా గాలమేసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్- జేడీఎస్లు గురువారం వరకు ఉండాల్సిందేనని పేర్కొన్నాయి. ఈరోజైనా ఇళ్లకు వెళ్లి తమ కుటుంబాలతో హాయిగా గడుపుతామని భావించిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నిర్ణయం నిరాశ కలిగించింది. తమను ఆదివారం నాడే నియోజకవర్గాలకు పంపుతామన్నారు.. ఇంతలోనే మనుసు మార్చుకోవడమేంటని కొంత మంది సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మే 15 నుంచి కుటుంబాలకు దూరంగా ఉన్నామని, సొంత ఊళ్లకు వెళ్లిరావడానికి కనీసం ఒక్కరోజైనా అనుమతించాలని వారు కోరుతున్నారు. అయితే వారి ప్రతిపాదనలను అధిష్ఠానం తోసిపుచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలోని హిల్టన్ హోటల్లో ఉండగా, లీ మెరేడియన్లో ఉన్న జేడీఎస్ సభ్యులను దొడ్డబళ్లాపూర్లోని ఓ రిసార్ట్కు తరలించారు. అలాగే నాలుగు రోజులు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్గౌడ్ పాటిల్లు, ఇద్దరు స్వతంత్రులు సైతం కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. సభలో బలపరీక్ష ముగిసిన వరకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ శిబిరం విడిచి వెళ్లరని, సోమవారం మరోసారి వారితో సమావేశం నిర్వహిస్తామని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ తెలియజేశారు. మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వచ్చి, మనుగడ సాధించడం ఎంత ముఖ్యమో జేడీఎస్ ఎమ్మెల్యేలకు కుమారస్వామి పదే పదే హితబోధ చేస్తున్నారు. అలాగే క్యాబినెట్ కూర్పులో తండ్రి దేవెగౌడతోపాటు తాను తీసుకోబోయే నిర్ణయాలకు కూడా మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యేలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయంపై ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నందున సహకరించాలని అంటున్నారు. బీజేపీ ఇంకా తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సిద్ధ రామయ్య, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్లు తమ సభ్యులను హెచ్చరించారు. 

Related Posts