YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సికింద్రాబాద్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి..

సికింద్రాబాద్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి..

హైదరాబాద్, సెప్టెంబర్ 13, 
కింద షోరూం..పై అంతస్థులో హోటల్‌ లాడ్జ్‌. ఎప్పుడూ బిజీగా ఉండే ఏరియా. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇ-ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో బ్యాటరీ బ్లాస్ట్‌ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందే తెలిసేలోపే బాంబుల్లా పేలాయి బ్యాటరీలు. దట్టమైన పొగ కమ్మేయడంతో లాడ్జ్‌లో ఉన్న దాదాపు పాతికమంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్లు..తాజాగా జరిగిన సికింద్రాబాద్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనకు కూడా రీజన్స్‌ చాలా ఎక్కువే. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు ఆఫీసు సమీపంలో ఉన్న రూబీ హోటల్‌ కమ్‌ లాడ్జ్‌ ఏరియా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. కింద సెల్లార్‌లో ఇ-ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం ఉంది. ఆపై నాలుగు అంతస్థులో పాతిక రూములున్న లాడ్జి. టూరిస్టులు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఒక్కటే మార్గం. పక్కనే ఇరుకుగా మెట్లమార్గం ఉన్నా.. లాడ్జికి వచ్చిన టూరిస్టులకు దాని గురించి తెలియదట. అదే పలువురి ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణమైందని టాక్‌.సికింద్రాబాద్‌లోని రూబీలాడ్జి కింద ఉన్న ఇ-ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టారు. ఈ సమయంలోనే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఆ తర్వాత పక్కనే ఉన్న సుమారు 40- నుంచి 50 వరకు పార్కింగ్‌ చేసి ఉంచిన బైక్‌ల బ్యాటరీలు బాంబుల్లా పేలాయి. కేవలం నిమిషాల వ్యవధిలో భారీశబ్ధంతో బ్లాస్టయ్యాయి. దాంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు, పొగ, పై అంతస్థుకి వ్యాపించడంతో లాడ్జిలో ఉన్న టూరిస్టులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. కొందరు లాడ్జి కిటిలనుంచి బయటకు వచ్చి కిందకు దూకేశారు. వారంతా స్వల్పంగా గాయపడ్డారు. మరో 10 మంది పైపులు పట్టుకొని సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.ఈ ఘటనతో అలర్టయిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు స్పాట్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి మరికొందర్ని రక్షించారు. రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేశారు. రూబీ హోటల్‌లో దట్టంగా పొగలు అలుముకోవడంతో పై అంతస్తుకు వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో అగ్నిమాపక, పోలీసు సిబ్బంది లోపలి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యారు.సెల్లార్‌లోని ఇ-ఎలక్ట్రిక్‌ బైక్ షోరూంలో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసిపడి ప్రమాదం జరిగిందని తెలిపారు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఏడుగురు చనిపోయారని సీపీ చెప్పారు. రూబీ లాడ్జిలో ప్రమాదం జరిగిన సమయంలో 25 మంది టూరిస్టులు ఉన్నారని ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురిని యశోధ, మరో 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనతో అలర్టయిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.ఇక సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. లాడ్జిలో చిక్కుకున్న వారిని ఫైర్‌ సిబ్బంది సేఫ్‌గా కాపాడారన్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ సైతం సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు.

Related Posts