
లక్నో, అక్టోబరు 10,
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ములాయంకు చికిత్స అందిస్తోన్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ‘ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. జీవనాధార మందులతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది’ అని ఇందులో పేర్కొంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ములాయం సింగ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన తనయుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విటర్‌లో వెల్లడించారు. ములాయం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ దృఢంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 82 ఏళ్ల ములాయం ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ములాయం ఆస్పత్రిలో చేరిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. ఎస్పీ అధినేత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. ములాయంకు ఉత్తమ చికిత్స అందించాలని ఆస్పత్రి యజామన్యాన్ని ఆదేశించారు.ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా ములాయం ఆరోగ్యంపై ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సీఎం కెసిఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు.