YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆశావహూల్లో నిరాశ

ఆశావహూల్లో నిరాశ

హైదరాబాద్, నవంబర్ 18,
మ‌ళ్లీ సిట్టింగ్‌ల‌కే సీట్లు అంటూ సీఎం కేసీఆర్ కుండ‌బ‌ద్ధలు కొట్టడంతో ఓరుగ‌ల్లు కారు పార్టీలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. ఆశ‌వ‌హుల్లో అంత‌ర్మథ‌నం మొద‌ల‌వ‌గా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రగ‌ణంలో మాత్రం ఆనందం హుషారెత్తుతోంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం ఉండ‌గానే కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై పార్టీ శ్రేణుల‌ భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యల‌ను పాజిటివ్‌, నెగ‌టివ్ కోణాల్లో విశ్లేష‌ణ జ‌రుగుతూనే.. వ్యూహాత్మక వ్యాఖ్యలుగానే కొంత‌మంది అభివ‌ర్ణిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని మెజార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు జ‌నాద‌ర‌ణ త‌క్కువ‌గా ఉంద‌ని పీకే టీం చేసిన స‌ర్వేల్లో వెల్లడైయిన‌ట్లుగా పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప‌లుమార్లు చేయించిన స‌ర్వేల్లోనూ కొంత‌మంది ఎమ్మెల్యేల ప‌నితీరు మెరుగు ప‌డ‌క‌పోగా నానాటికి గ్రాఫ్ దిగ‌జారుతూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. పనితీరు బాగోలేని వారికి టికెట్లు ఇచ్చే ప్రస‌క్తే లేద‌ని గ‌తంలో చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు సిట్టింగ్‌ల‌కే సీట్లంటూ చేసిన వ్యాఖ్యల‌ను సీనియ‌ర్ లీడ‌ర్లు రాజ‌కీయ కోణంలో మాత్రమే చేసిన‌విగా అభివ‌ర్ణిస్తున్నారు. ప్రస్తుతమున్న ప్రత్యేక ప‌రిస్థితుల్లోనే కేసీఆర్ టికెట్లపై వ్యాఖ్యనాల‌ను అర్థం చేసుకోవాల‌ని కూడా గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రికొంత‌మంద‌యితే రాజ‌కీయ వ్యూహంతో చేసిన వ్యాఖ్యలేన‌ని, ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి త‌ప్పక మారుతుంద‌న్న అభిప్రాయాన్ని నొక్కి వ‌క్కానిస్తుండటం విశేషం.ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉంద‌ని స‌ర్వేల్లో తేలింద‌ని అందిన స‌మాచారంతో ఆశ‌వ‌హులు ఆక్టివ్ అయ్యారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ప‌ర‌కాల‌లో ఎమ్మెల్యే చ‌ల్లా వ‌ర్సెస్ నాగుర్ల వెంక‌టేశ్వర్లు, భూపాల‌ప‌ల్లిలో ఎమ్మెల్యే గండ్ర వ‌ర్సెస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న‌చారి, మానుకోట‌లో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ వ‌ర్సెస్ ఎంపీ క‌విత‌, డోర్నక‌ల్‌లో రెడ్యానాయ‌క్ వ‌ర్సెస్ మంత్రి స‌త్యవ‌తిరాథోడ్‌, వ‌రంగ‌ల్ తూర్పులో ఎమ్మెల్యే న‌రేంద‌ర్ వ‌ర్సెస్ ఎమ్మెల్సీ సార‌య్య, మేయ‌ర్ సుధారాణిలుగా ఉంది. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజ‌య్య, ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి మ‌ధ్య ప‌చ్చగడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ సారి టికెట్ ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని క‌డియం గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నట్లు నియోజ‌క‌వ‌ర్గ లీడ‌ర్ల ద్వారా తెలుస్తోంది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ స్వపక్షంల విప‌క్షం క‌నిపించింది. ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన పొలిటిక‌ల్ పంచాయ‌తీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల వ‌ర‌కు వెళ్లడం గ‌మ‌నార్హం. పార్టీలో పోటీ వాతావ‌ర‌ణం ఉండాల‌నే దృక్పథంతోనే అధిష్ఠానం కూడా ఎవ్వరిని నొప్పిప్పక తానొవ్వక అనే రీతిలో వ్యవహ‌రిస్తూ వ‌చ్చింది. ఇక జ‌న‌గామ‌, న‌ర్సంపేట‌లో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీదారులేకున్నా ఇద్దరి ప‌నితీరు, ప్రజ‌ల్లో జ‌నాద‌ర‌ణ మాత్రం చాలా తీసికట్టుగా ఉంద‌ని పీకే స‌ర్వే రిపోర్టును అధిష్ఠానానికి స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ లీడ‌ర్ల నుంచి టికెట్ పోటీ ప్రమాదం లేకుండా చేసుకున్న అసంతృప్తిని మాత్రం పెంచిపోషించుకుంటున్నారుఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, వ‌రంగ‌ల్ తూర్పు, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, పాల‌కుర్తి, డోర్నక‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, ప‌ర‌కాల‌,న‌ర్సంపేట పూర్తి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాక్షిక నియోజ‌క‌వ‌ర్గాలైన జ‌న‌గామ‌, మంథ‌ని, హుస్నాబాద్‌, ఇల్లందు, భ‌ద్రాచలం, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ములుగు, మంథ‌ని, హుజురాబాద్‌ మిన‌హా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. పీకే టీం.. ఐప్యాక్ స‌ర్వేలో అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉన్నట్లు స‌ర్వేల్లోనూ బ‌య‌ట‌పడిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఒక‌రిద్దరిని సున్నితంగా హెచ్చరించిన సీఎం కేసీఆర్‌.. మ‌రో న‌లుగురైదుగురికి మాత్రం తీవ్ర స్థాయిలో హెచ్చరిక‌లు జారీ చేసిన‌ట్లుగా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌నితీరు బాగోలేని ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌నే చ‌ర్చ పార్టీలో ఇటీవ‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఈ భావ‌న‌తో కొంత‌మంది ఎవ‌రి పంథాలో వారు నియోజ‌క‌వ‌ర్గాల‌పై గురి పెట్టుకుని పార్టీలో సైలెంట్‌గా ఉంటూనే ఉనికి చాటుకునే ప్రయ‌త్నం చేస్తూ వ‌స్తున్నారు. స‌మ‌యం, సంద‌ర్భాం క‌లిసి వ‌స్తే అధిష్ఠానం పెద్దల‌ను ప్రస‌న్నం చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే సిట్టింగ్‌ల‌కే సీట్లంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆశ‌వ‌హుల్లో నైరాశ్యంలోకి నెట్టివేస్తున్నాయి. అయితే సీనియ‌ర్లు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యల‌ను రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ కోణంలో చూడ‌లంటూ పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.

Related Posts