YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ టిక్కెట్లకు భలే..భలే

గులాబీ టిక్కెట్లకు భలే..భలే

హైదరాబాద్, నవంబర్ 21, 
టీఆర్ఎస్‌లో రెండేసి టికెట్లు కావాలని ఆశ పడుతోన్న లీడర్ల జాబితా పెద్దగానే ఉంది. తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు కావాలని పట్టుదలగా ఉన్నారు. కొందరు కొడుకుల కోసం, ఇంకొందరు కూతుళ్ల కోసం టికెట్లు అడుగుతున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని ప్రతిపాదనను తెర మీదికి తెస్తున్నారు. తమకిచ్చే రెండు స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలకు ఆ నియోజకవర్గాల్లో తమకు ఉన్న పరపతి, ప్రజాబలాన్ని సర్వే చేయించి రిపోర్టలను అందచేస్తున్నారు.సికింద్రాబాద్ ఎంపీ సీటుపై చాలామంది టీఆర్ఎస్ లీడర్లు కన్నేశారు. ఈ స్థానాన్ని ఎలాగైనా తమ రాజకీయ వారసులకు ఇప్పించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రెండేసి టికెట్లు అడుతుతోన్న లీడర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు సనత్ నగర్ టికెట్ తోపాటు తన కొడుకు సాయి కిరణ్‌కు మళ్లీ సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సాయి కిరణ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా తమ కుటంబానికి రెండు టికెట్లు కావాలని తలసాని అడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మరావు కూడా ఈసారి సికింద్రాబాద్ అసెంబ్లీ సీటుతో పాటు తన కొడుకు రామేశ్వరరావుకు సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇవ్వాలనే ప్రతిపాదనను కేసీఆర్‌కు పెట్టినట్టు తెలిసింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ, తన భార్య చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్‌కు సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతుంది.మల్కాజిగిరి ఎంపీ సీటును తమ వారసులకు ఇవ్వాలని అటు మంత్రి మల్లారెడ్డి, ఇటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా టీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి తన అల్లుడుకు లేకపోతే కొడుకు బద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అలాగే మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్‌తోపాటు ఎంపీ టికెట్ ఇవ్వమని సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరుతున్నట్టు చర్చ ఉంది. చాలాకాలంగా తన కొడుకు మైనంపల్లి రోహిత్‌కు వివిధ రాజకీయ కార్యక్రమాల బాధ్యతలను హన్మంతరావు అప్పగిస్తూనే ఉన్నాడు. ఈసారి ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కొడుకు కార్తీక్ రెడ్డిని చట్టసభల్లోకి పంపేందుకు కాంగ్రెస్‌లో ఉన్నప్పట్నించి ప్రయత్నిస్తునే ఉన్నారు. 2018లో మహేశ్వరం నుంచి పోటీ చేసిన సబితా కార్తీక్ కోసం రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నించారు. అసెంబ్లీ టికెట్ సాధ్యం దక్కకపోవడంతో చేవేళ్ల ఎంపీ సీటు ఇవ్వాలని అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. ఇక్కడైనా సబితా కోరిక తీరేనా అనే చర్చ జరుగుతోంది. కార్తీక్ కోసం రాజేంద్రనగర్ అసెంబ్లీ లేదా చేవేళ్ల ఎంపీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుంది. తన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డికి కొండంగల్ అసెంబ్లీతో పాటు తనకు తాండూరు ఎమ్మెల్యే లేదా చేవేళ్ల ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ తనకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపింపే ప్లాన్‌లో మహేందర్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని చిన్న కొడుకు భాస్కర్ రెడ్డికి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అయితే ఈసారి కూడా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నారు. అయితే చాలా కాలంగా రాజకీయంగా సపోర్టుగా ఉన్న చిన్న కొడుకును ఎలాగైన చట్టసభల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే ఆ సీటును దక్కించుకోవాలని ప్లాన్‌లో పోచారం ఉన్నట్టు సమాచారం. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తన కొడుకు జనార్ధన్‌ను నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలనే భావిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ సెగ్మంట్‌లో గట్టి పట్టున్న బాజిరెడ్డి తనకు ఎంపీ టికెట్ ఇస్తే అర్వింద్ ఓటమి సులువవుతోందని అభిప్రాయంలో ఉన్నట్టు తెలిసింది.ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ తన భర్త శ్యామ్‌కు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల జేఏసీలో కీలకంగా పనిచేసిన శ్యామ్‌కు గత ఎన్నికల్లోనే అదిలాబాద్ ఎంపీ టికెట్ హామీ అమలు కాలేదని చర్చ ఉంది. ఈసారైన తప్పకుండా తన భార్యకు ఎమ్మెల్యే, తనకు ఎంపీ సీటు దక్కుతుందుని ఆశలో శ్యామ్ ఉన్నారు.మాజీ మంత్రి రెడ్యానాయక్ ఈసారి కూడా తమ ఇంట్లో రెండు సీట్లు కావాలని అడుగుతున్నారు. కాని రెండో టికెట్ కూతురు కాకుండా కొడుక్కు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం రెడ్యానాయక్ డోర్నకల్ ఎమ్మెల్యేగా,కూతురు కవిత మహబూబ్ బాద్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తను డోర్నకల్ నుంచే పోటీ చేయడంతో పాటు కొడుకు రవిచంద్రను ఎంపీగా పోటీ చేయించే యోచనలో రెడ్యానాయక్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కూతురు కావ్యకు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, కుదరకపోతే వరంగల్ ఎంపీటికెట్ ఇవ్వమని అడుతున్నట్టు తెలిసింది. మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు మిత్ రెడ్డిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. మాజీ ఎంపీ మంధాజగన్నాథం ఈసారి తనకు అచ్చంపేట టికెట్ తో పాటు కొడుకు నాగర్ కర్నూలు టికెట్ అడుగుతున్నట్టు తెలిసింది.సిట్టింగ్‌లకు మాత్రమే టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో మరి తమ రాజకీయ భవిష్యత్ ఏంటని ఆందోళనలో చాలా మంది రాజకీయ వారసులు ఉన్నట్టు తెలిసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య వచ్చే ఎన్నికల్లో తండ్రికి కాకుండా తనకు టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం ఉంది. మాజీ మంత్రి జోగు రామన్న కొడుకు ప్రేమేందర్ వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Related Posts