YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఇన్ఫోసిస్ అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ అడుగులు

విశాఖపట్టణం, నవంబర్  23, 
దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చకచకా తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖ రుషికొండ ఐటీ సెజ్‌లో అక్టోబర్‌ ఒకటిన ఇన్ఫోసిస్‌ శాటిలైట్‌ కార్యాలయాన్ని తెరిచింది. త్వరలోనే ఈ ఐటీ సెజ్‌ నుంచి ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇన్ఫోసిస్‌ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమకు అవసరమైన వనరులు, సదుపాయాల గురించి ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు పరిశ్రమల శాఖ, ఆర్టీసీ, పోలీసు, జీవీఎంసీ తదితర అధికారులతో ఇటీవల చర్చించారు. నగరం నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు ఆ సంస్థ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి వీలుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సమ్మతిని తెలియజేశారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. అందువల్ల 24 గంటలూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.ఇన్ఫోసిస్‌ అవసరాలకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించడానికి కూడా తమకు అభ్యంతరం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఐటీ సెజ్‌కు ఎన్ని బస్సుల అవసరం అన్నది ఉద్యోగుల సంఖ్యను బట్టి  ఉంటుందని, దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.  మరోవైపు భీమిలి వెళ్లే బీచ్‌ రోడ్డు నుంచి ఐటీ సెజ్‌కు వెళ్లే రోడ్డు మరింత మెరుగు పరచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడకుండా ఆ రోడ్డుకు ఇరువైపులా పూర్తి స్థాయిలో వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ సెజ్‌కు వెళ్లే దారిలో భద్రత (సెక్యూరిటీ)పై కూడా దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను, ఆకతాయిలు, తాగుబోతులు, అల్లరి మూకల ఆగడాలను కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పోలీసులతో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇన్ఫోసిస్‌తో పాటు ఐటీ సెజ్‌లో విధులు నిర్వహించడానికి వెళ్లి వచ్చే ఉద్యోగినులు ఎలాంటి భయాందోళనలకు ఆస్కారం లేకుండా చూస్తారు.

Related Posts