YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీచర్ల ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

టీచర్ల  ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

విజయవాడ, డిసెంబర్ 2, 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోధనేతర  విధులకు టీచర్లను దూరంగా ఉండాలని ఆర్డినెన్స్ తీసుకు వస్తోంది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఈ పరిస్థితిని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా ఆలోచిస్తోంది. మంత్రి సీదిరి అప్పలరాజు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అలా చెబితే.. పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయడానికి చెబుతాయి. కానీ ఇక్కడ మంత్రే ప్రకటించారు. పై స్థాయి నుంచి సంకేతాలు రాకపోతే మంత్రి అలా ప్రకటించరు. అందుకే ముందస్తు ఎన్నికల కోణంలోనే ఈ బోధనేతర పనులు కేటాయింపును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. టీచర్లు లేకపోతే ఎన్నికల నిర్వహణ కష్టం అయిపోతుంది. అప్పుడు ఎన్నికల నిధులు నిర్వహించే వారి కోసం కష్టపడాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇచ్చింది. వారు పర్మినెంట్ ఉద్యోగులయ్యారు. వారందరికీ విధులు ఇస్తే టీచర్లు లేని లోటును భర్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు వీరిని ఎన్నికల విధుల్లో వినియోగించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకే ఈ అంశంపై ముందు ముందు  కీలక పరిణామాలు  చోటు చేసుకునే అవకాశం ఉంది. బోధనేతర విధులు వద్దని ఉపాధ్యాయులు చాలా కాలంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉపాధ్యాయులకు ఎన్నో బోధనేతర విధులు ఇచ్చారు. ఓ సందర్భంగా మద్యం దుకాణాల వద్ద కూడా డ్యూటీలు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి  పనులూ చెప్పబోమని అంటోంది. అయితే  ఆర్డినెన్స్ తెచ్చినా.. ప్రభుత్వం అనధికారికంగా వారి సేవలను మౌఖిక ఆదేశాల ద్వారా ఉపయోగించుకోగలదు. కానీ ఎన్నికల సేవలు మాత్రం అలా కాదు. బోధనేతర విధులు వద్దని చాలా కాలంగా టీచర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని టీచర్లు కూడా వ్యతిరేకించే అవకాశం లేదు.కానీ టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందున.. వారికి కేవలం ఎన్నికల విధులు ఇవ్వకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ నిర్ణయం  తీసుకుందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల విధుల్లో టీచర్లే ఎక్కువగా ఉంటారు. ఎన్నికలు సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఉన్న సమయంలో జరుగుతాయి. ఉపఎన్నికలు.. ఇతర ఎన్నికలు స్కూల్స్ నడుస్తున్న సమయంలో జరిగితే..సెలవు ఇస్తారు. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్‌ వరకు వారే ఉంటారు. సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ఎన్నిక సజావుగా సాగేలా చూస్తూంటారు. అందుకే టీచర్లు లేని ఎన్నికల ప్రక్రియను ఊహించడం కష్టం. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారు ఎన్నికల విధులకు దూరం అవుతారు. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. జగన్ ప్రభుత్వంపై టీచర్లు వ్యతిరేకతో ఉన్నారనేది  బహిరంగ రహస్యం.  వారి డిమాండ్లు అటుంచి అసలు జీతాలు, సాధారణ ఆర్థిక ప్రయోజనాలు , సీపీఎస్ రద్దు వంటి అంశాల్లో ప్రభుత్వం తీరు వారికి నచ్చడం లేదు. అందుకే ఉద్యమాలు చేస్తున్నారు.  అందుకే గతేడాది విజయవాడలో నిర్వహించిన భారీ ధర్నాలో ఉపాధ్యాయులకే కీలక పాత్ర పోషించి, అది విజయవంతం అవ్వడానికి కారణమయ్యారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరుపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పలురకాల మొబైల్‌ యాప్‌లతో సతమతమవుతున్న టీచర్లలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. తమపై వ్యతిరేకత ఉన్న వారు ఎన్నికల విధుల్లో భాగం అయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న కారణంగా ప్రభుత్వం.. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.  

Related Posts