YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల బిల్లు

అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల బిల్లు

విజయవాడ, జనవరి 23, 
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. మొదటి వారంలో సమావేశాలు ఉండే అవకాశముంది. అయితే ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టనున్నారన్నది సమాచారం. ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయింది. మూడు రాజధానుల బిల్లులు గతంలో సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా సభలో తిరిగి బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ కసరత్తులు చేస్తుందని చెబుతున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కులు కారణంగా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు అమరావతి రైతులు ఏకైక రాజధానిగా ఉంచాలంటూ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. హైకోర్టు కూడా అమరావతి రైతులకు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండటం చర్చకు దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఎన్నికలు దగ్గరపడే లోపు మూడు రాజధానుల విషయంలో వేగవంతమైన స్టెప్ తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనపడుతుంది. మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకునేటప్పడే జగన్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. బలంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగి బిల్లులను తెస్తామని చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమంటూ ప్రజల్లోకి వెళ్లాలంటే ముందడగు వేయకతప్పదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే ఏప్రిల్ నాటికి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని కూడా మంత్రులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లులను ఏ రూపంలో సభ ముందుకు తీసుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభలో చట్టం చేయడం ద్వారా మరోసారి న్యాయస్థానం ఎదుటకు సమస్య వెళ్లినా ఇబ్బందులు ఎదురుకాకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతనే బిల్లులు సభ ముందుకు ప్రభుత్వం తెస్తుందని అంటున్నారు. మొత్తం మీద వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాలు దాదాపు ఇరవై రోజులకు పైగానే జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లులు తిరిగి ప్రవేశ పెడతారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Related Posts