YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గవర్నర్ వర్సెస్ సర్కార్

గవర్నర్ వర్సెస్ సర్కార్

హైదరాబాద్, జనవరి 24, 
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది. రిపబ్లిక్ డే,  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరే చూస్తారుగా..  అని తెలంగాణ గవర్నర్ తమిళిసై  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ స్పందన ఇచ్చారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ఆ రెండింటిలోనూ గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం గవర్నర్  విషయంలో ఏ మాత్రం మరో అబిప్రాయానికి రావడం లేదని.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి స్వేచ్ఛకు ప్రతీకగా దీన్ని దేశ వ్యాప్తంగా జరుపుతారు. ఈ వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కాబట్టి ఈ వేడుకలు చేస్తారు. జనవరి 26న ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగస్టు 15 లాగే ..  జనవరి 26ను కూడా ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. శకటాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోతూండటంతో ఈసారి కూడా రాజ్ భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు.  గతేడాది రాజ్‌భవన్‌లో జరిగిన 73వ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ హాజరుకాలేదు. ప్రగతి భవన్‌  లోనే  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేళాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన వెలువడింది.  గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు మొదలు కానున్నాయి. గవర్నర్ తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో... 2021 సెప్టెంబర్ 27న మొదలైన సమావేశాల కొనసాగింపుగానే ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. గవర్నర్ తమిళిసై రాజకీయం చేస్తున్నారని..  తెలంగాణ సర్కార్ ఆగ్రహంతో ఉంది. గవర్నర్ పదవి ఉనికిని గుర్తించడం లేదు. ప్రోటోకాల్ అసలు పాటించడం లేదు. దీనిపై తమిళిసై చాలా సార్లు ఆరోపణలు  చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ , తమిళిసై  కార్యక్రమాల్లో పాల్గొన్నరు. ఓ సారి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. మరోసారి రాష్ట్రపతికి ఆహ్వానం పలికే కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నారు. అయితే కేసీఆర్ చీఫ్ జస్టిస్, రాష్ట్రపతిలకు గౌరవం ఇవ్వాలనే పాల్గొన్నారు కానీ.. గవర్నర్ తో కలిసి పాల్గొనాలని కాదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. కానీ తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకుంది.

Related Posts