YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హస్తినలో తెలంగాణ రాజకీయం....

హస్తినలో తెలంగాణ రాజకీయం....

హైదరాబాద్, మార్చి 14, 
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ బాట పట్టాయా? ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ వ్యూహాలు రూపు దిద్దుకుంటు న్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ప్రమేయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం హస్తినకు మారిందని అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధిచి కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, అంతకు ముందే ఆమె  మూడు దశాబ్దాలకు పైగా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును భూమార్గం పట్టించేందుకు  ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద  ‘దీక్ష’ చేయడం, ఆ వెంటనే, ఈడీ విచారణకు హాజరు కావడం ఇలా ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో  తెలంగాణ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారింది.అన్నిటినీ మించి ఢిల్లీ మద్యం కేసులో అంతవరకు  ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని  ముఖ్యమంత్రి కేసీఆర్  ముందు ఆమెను ఒంటరిగా ఢిల్లీకి పంపి, ఆ వెనక కేటీఆర్, హరీష్ రావు సహా అరడజను మందికి పైగా మంత్రులను ఢిల్లీకి పంపారు. అంతకు ముందే కవిత దీక్ష కోసం ఢిల్లీ చేరిన బీఆర్ఎస్  భారత జాగృతి (తెలంగాణ జాగృతి) శ్రేణులు, ఈడీ  విచారణ జరిగిన రోజు (మార్చి11)న ఢిల్లీ లో హల్ చల్ సృష్టించారు. ఇలా ఒక్కసారిగా, ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితకు అండగా రంగంలోకి దింపడంలో కేసేఆర్  వ్యూహం ఏమైనప్పటికీ ఆ రోజుకు కవిత బయట పడ్డారు. కానీ, కథ అంతటితో ముగియ లేదు. మళ్ళీ  మార్చి 16న మరోమారు  విచారణకు హజరు కావాలని ఈడీ  కవితకు అదే రోజున తాజా సమన్లు జారీ చేసింది. మంత్రులంతా మళ్ళీ కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్తారా? ప్రత్యేక విమానాలు, రైళ్ళలో జనాలను, కార్యకర్తలను ఢిల్లీకి  తరలిస్తారా? ఢిల్లీలో మళ్ళీ అదే హల్ చల్ సృష్టిస్తారా  అనేది పక్కన పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న భారీ అవినీతి ఆరోపణ  ఢిల్లీలో గజ్జెకట్టి ఆడేందుకు సిద్దమవుతోంది. అవును ప్రధాని నరేంద్ర మోడీ  మొదలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  వరకు బీఆర్ఎస్  ప్రభుత్వం ఏటీఎం గా అభివర్ణించిన  కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల మంగళవారం  ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్దమయ్యారు. కాళేశ్వరం అవినీతి గురించి ఇప్పటికే షర్మిల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికీ తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అతిపెద్ద కుంభకోణంగా ఆమె మొదటి  నుంచి ఆరోపిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు అయితేనేమీ లేదంటే ఇతర సమాచారం ఆధారంగా అయితే నేమి, కాగ్   కాళేశ్వరం ప్రాజెక్ట్ పద్దులపై ప్రత్యేక ఆడిట్ ప్రారంభించింది. ఢిల్లీలో కాళేశ్వరం అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో  ప్రదర్శన నిర్వహించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. దీనికి మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అవినీతి విషయంలో తాను చేస్తోన్న పోరాటానికి కలిసి రావాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ యేతర పార్టీలు తనకు అండగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలియజేయాలని కోరారు. షర్మిల కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కామ్  గా పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16.46 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.38,000 కోట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి రీ- డిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచారని విమర్శించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. నాణ్యత లేని పనులు చేపట్టి మూడు సంవత్సరాలే కాళేశ్వరాన్ని ముంచారని ధ్వజమెత్తారు. మెగా కంపెనీతో కుమ్మక్కై దాదాపు 70 వేల కోట్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే తాము కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశామని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ఈ విషయాన్ని ఎంపీల దృష్టికి తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశమని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదని, విచారణ జరిపించి.. అది నిజం అని నిరూపించాలని డిమాండ్ చేశారు. నిజానికి, కవిత లిక్కర్ కుంభకోణం కంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ చేస్తున్నాయి. అయితే  షర్మిల సంధించిన బాణం, బీఆర్ఎస్ నే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టేస్తుందని అంటున్నారు.

Related Posts