YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిరణ్ కుమార్ రెడ్డికి వర్గం ఎవరు...

కిరణ్ కుమార్ రెడ్డికి వర్గం ఎవరు...

తిరుపతి, మార్చి 17, 
ఏపీలో బీజేపీని పైకి లేపేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం నానా తంటాలు పడుతోంది. మొన్నటి వరకు పవన్‌ కల్యాణ్ వెంట తిరిగిన కమలనాథులు… ఆయన వేరే దిక్కు చూస్తుండటంతో ఇప్పుడు రూట్ మార్చారు. అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ కొట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని రెడ్డి యాంగిల్లో నరుక్కు రావాలనే మరో ప్రయోగానికి తెర తీస్తోంది.రాష్ట్ర విభజన తప్పదని తెలిసీ చివరి నిమిషం వరకు సీఎంగా ఉండి… చివర్లో రాజీనామా చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. లాస్ట్ బాల్ ఉంది.. లాస్ట్ బాల్ ఉంది అంటూ సమైక్యవాదులను ఊరించి ఉసూరుమనిపించిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదే. ఆ తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో అభ్యర్ధులను బరిలోకి దింపిన కిరణ్ తాను మాత్రం పోటీ చేయలేదు. కనీసం సొంత నియోజకవవర్గం పీలేరులో సొంత తమ్ముడిని కూడా ఆయన గెలిపించుకోలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్రం మళ్లీ సమైక్యంగా ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేశారు. బెర్లిన్‌ గోడను కూలగొట్టి తూర్పు, పశ్చిమ జర్మనీలను ఏకం చేశారని చెబుతూ.. ఆ గోడ రాయి ముక్కను తీసుకువచ్చి మరీ చూపించారు.ఆయన చెప్పిందేదీ జరగలేదు. అలాగే ఆయన పార్టీ కూడా ఇప్పుడు లేదు. చెప్పా పెట్టకుండా ఆ పార్టీని మూసేశారు. అన్న మీద ఆశలు వదలుకున్న తమ్ముడు కూడా తమ కుటుంబానికే బద్ధ శత్రువులాంటి చంద్రబాబు దగ్గర చేరిపోయారు. కాంగ్రెస్‌కు బుద్దిరావాలంటూ చెప్పు గుర్తుతో పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2018లో తిరిగి అదే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన చేరడంతో అట్టడుగుకుపోయిన కాంగ్రెస్ లేచి నిలుచుంటుందని ఆ పార్టీలో మిగిలిన వాళ్లు ఆశ పడ్డారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరారనే మాటే కానీ ఏ నాడూ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంది లేదు.హైదరాబాద్‌లో ఉంటూ నిత్యం గోల్ఫ్ ఆడుకుంటూ కాలం గడుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి… ఇప్పుడు ఏపీ బీజేపీకి అవసరం అయినట్టున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏపీలో బీజేపీ విస్తరణకు ఉపయోగం ఉంటుందనే కోణంలో ఆ పార్టీ ఆలోచన చేస్తోందట. ఏపీలో పార్టీని పైకి లేపేందుకు నానా తంటాలుపడుతున్న కమలనాధులు కొండకు వెంట్రుక వేసినట్టు … దాదాపు 9 ఏళ్ల నుంచి రాజకీయాలకే దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపులపై ఫోకస్ పెట్టింది బిజేపీ. ఆ కోణంలో మొదటి అధ్యకుడిగా కన్నా లక్ష్మీనారాయణను, ఆయన తర్వాత ఇప్పుడు సోము వీర్రాజును పెట్టింది. అయినా ఊపు కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని పైకి ఎగబాకాలని చూసినా…. అది ఫలించేలా కనిపించకపోవడంతో ఇప్పుడు రెడ్డి యాంగిల్ లో తాజా ప్రయత్నాలు చేస్తోంది.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి చీఫ్ విప్‌గా.. ఇంకోసారి స్పీకర్‌గా.. దాదాపు మూడేళ్లకుపైగా సీఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి అటు ఏపీలోగానీ.. ఇటు తెలంగాణలోగానీ సొంత వర్గమే లేదని అంటారు. వైఎస్ మరణం తర్వాత పెద్ద దిక్కుగా ఉంటారని అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసిన రోశయ్య స్థానంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్‌. కనీసం మంత్రిగా కూడా అనుభవం లేకున్నా…. ఏకంగా సీఎం పదవిని ఇచ్చిన సోనియాపట్ల కృతజ్ఞత కూడా లేకుండా కాంగ్రెస్‌పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో వదిలేసి పోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు కిరణ్‌. మరి.. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా బీజేపీ ఏం ఆశిస్తోందో ఏమో కానీ…. ఆయన ద్వారా ఆ పార్టీ ఏం సాధిస్తోందోనన్న సందేహాలు మాత్రం అన్ని పార్టీల నేతల్లో ఉన్నాయి.

Related Posts