YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరు నుంచే ఆనం పోటీ..

ఆత్మకూరు నుంచే ఆనం  పోటీ..

నెల్లూరు, మే 24, 
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. శుభకార్యాలకు వెళ్లడం, పరామర్శలకు వెళ్తూ నాయకులందర్నీ కలసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ తాను టీడీపీ తరపున పోటీ చేసే విషయాన్ని ఎక్కడా బహిరంగ పరచలేదు ఎమ్మెల్యే ఆనం. కానీ తొలిసారి ఆయన టీడీపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించేశారు. అయితే ఆత్మీయుల వద్దే ఆయన ఆ మాట చెప్పారు కానీ బహిరంగ ప్రకటన చేయలేదు. టీడీపీ తరపునే పోటీ చేస్తానన్నారు, ఎంపీగా కాదు, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే నియోజకవర్గం మాత్రం ఫైనల్ చేయలేదు ఆనం. గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అదే నియోజకవర్గం తరపున బరిలో దిగి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో వెంకటగిరికి వెళ్లారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. కానీ పార్టీలో ఇమడలేకపోయారు. అభివృద్ధికి నిధులు లేకుండా కట్టడి చేయడం, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో పెత్తనం లేకపోవడం, ఉన్నా పనులు చేయించుకోలేని పరిస్థితి రావడంతో ఆయన పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసి బయటకొచ్చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే నెపంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ. అప్పటినుంచి ఆయన మళ్లీ వెంకటగిరికి వెళ్లలేదు. నెల్లూరులోని తన ఇంట్లోనే ఉంటున్నారు. అడపా దడపా ఆత్మకూరుపై ఫోకస్ చేస్తున్నారు. అక్కడ జరిగే శుభకార్యాలకు వెళ్తున్నారు. పరామర్శలకు ముందుంటున్నారు. తాజాగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని  వరికుంటపాడుకి వచ్చిన ఆనం.. మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ అండ్రా నాగిరెడ్డి ఇంటిలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని చెప్పారు ఆనం. సరిగ్గా ఎన్నికల ముందు 60 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని చెప్పారు. ఇంకా ఏడాది అధికారం ఉంది కాబట్టి, కొంతమంది వారి పనుల దృష్ట్యా తాత్కాలికంగా వైసీపీలో ఉంటున్నారని వివరించారు. ఈసారి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానన్నారు. అంటే టీడీపీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నాననే సంకేతాలు పంపించారు ఆనం. దాదాపుగా ఆయనకు టీడీపీలో టికెట్ ఖరారైందని, అది కూడా ఆత్మకూరునుంచే అనే ఊహాగానాలు వినపడుతున్నాయి. వైసీపీ బహిష్కృత నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు దాదాపుగా టీడీపీ గూటికి చేరుకున్నట్టే కనపడుతోంది. నెల్లూరులోని ముగ్గురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా తన తమ్ముడిని టీడీపీలోకి పంపించి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్థానిక టీడీపీ నాయకులతో సఖ్యత పెంచుకుంటున్నారు. ఏ క్షణంలో అయినా ఆయన టీడీపీవైపు వచ్చేస్తారని టాక్. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాదాపుగా టీడీపీ తరపున పోటీ చేయడానికే ఇష్టం చూపిస్తున్నారు. ఆమధ్య జనసేన, బీజేపీ అంటూ ఊహాగానాలు వినిపించినా.. తాజాగా ఆయన టీడీపీకే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశించిన తర్వాత నియోజకవర్గం ఖరారవుతుందని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో బహిష్కృత ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుకుంటున్నారని స్పష్టమైపోయింది.

Related Posts