YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భోగశ్రీనివాసుడికి సహస్రకలశాభిషేకం

భోగశ్రీనివాసుడికి  సహస్రకలశాభిషేకం

తిరుమల, మే 24, 
తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి మే 28వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 17 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 78,349మంది భక్తులు దర్శించుకున్నారు. 39,634 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.. హుండీకి రూ. 4.56 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా సోమ‌వారం విశేష హోమాలు నిర్వ‌హించారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత ఉక్త హోమాలు, పంచసూక్త హోమాలు జ‌రిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Related Posts