YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎక్కడా కనిపించని నల్లారి...

ఎక్కడా కనిపించని నల్లారి...

తిరుపతి, మే 29, 
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి రెండు నెలలు కావస్తుంది. అయితే ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల్లో ఆయన యాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీలోనూ కాలం గడిపేయడానికి నల్లారి నిర్ణయించుకున్నారా? లేక రెండు రాష్ట్రాల బీజేపీ నాయకత్వం ఆయనను ఉపయోగించుకోవడం లేదా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనను అన్ని రకాలుగా ఆదరించిన కాంగ్రెస్‌ను వదిలి కమలం గూటికి చేరారు. ఎప్పటి లాగానే ఆయన చేరిక ఢిల్లీలో హడావిడిగా సాగింది. అమిత్ షా వంటి నేతలను కలిసి శాలువాలను కప్పేసుకున్నారు. తాను రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని నల్లారి ఢిల్లీలో మీడియాతో చెప్పారు.కమలం కండువా కప్పుకున్న తర్వాత తొలిసారి బెజవాడ వచ్చి మళ్లీ మాజీ ముఖ్యమంత్రి హల్ చల్ చేశారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, అలాగే పుట్టిన ఊరు ఏపీలో ఉందని, తాను రెండు రాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకెళతానని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై తాను త్వరలోనే మీడియా సమావేశం పెడతానని కూడా చెప్పారు. కానీ నెలలు గడచిపోతున్నా ఇంత వరకూ ఆయన మీడియా సమావేశం పెట్టింది లేదు. పార్టీ కోసం పనిచేసింది లేదు. ఆయన హైదరాబాద్‌లోనే సేద తీరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయన యాక్టివ్ కావడం లేదు. కాంగ్రెస్ లో చేరేటప్పుడు రాహుల్ సమక్షంలో చేరి హడావిడి చేసిన నల్లారి తర్వాత కామ్ అయిపోయారు. ఇప్పుడు అదే తరహా ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోవడంతో పెద్దయెత్తున చేరికలుంటాయని అందరూ భావించారు. ఢిల్లీ పెద్దల వద్ద కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి కావడం, బలమన సామాజికవర్గం నేత కావడంతో హస్తినలోని ముఖ్యులు కూడా నల్లారి మాటను నమ్మారు. కానీ రెండు నెలలవుతున్నా ఆయన ఎవరినీ పార్టీలోకి తీసుకు వచ్చింది లేదు. చేసింది లేదు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నుంచి లబ్ది పొందిన వారు సయితం బీజేపీలో చేరడానికి సందేహిస్తున్నారు. ఆయన కొందరి నేతలతో ఫోన్‌లో మాట్లాడినా వారు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఏపీలో బీజేపీకి, కాంగ్రెస్‌కి భవిష్యత్ కనపడక పోవడంతో ఎవరూ కండువాలు కప్పుకునేందుకు ముందుకు రావడం లేదు.  మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొందరు వస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారం గానే మిగిలిపోయింది. కొత్తగా పార్టీలో చేరి తన సత్తా చూపించాల్సిన తరుణంలో ఈ నేత మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా నల్లారి దూరంగా ఉన్నారు. ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకోక పోవడంతో ఢిల్లీ పెద్దలకు నల్లారి అసలు సత్తా అర్ధమయిందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. పార్టీలో చేరి తానేంటో నిరూపించుకోవాల్సిన సమయాన్ని నల్లారి హైదరాబాద్‌లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవడం, నేతలకు దూరంగా ఉండటంతో అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా సందేహంగా ఉంది. కండువాను కప్పుకుని కామ్ గా ఉండటం ఎంత వరకూ సబబన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజంగా నల్లారి తనంతట తాను దూరంగా ఉన్నారా? నేతలు ఆయనను పక్కన పెట్టారా? అన్నది ఆయనే స్వయంగా చెప్పాల్సి ఉంది.

Related Posts