YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సస్పెండ్ చేసినా పార్టీలో ఉన్నట్టేనా

సస్పెండ్ చేసినా పార్టీలో ఉన్నట్టేనా

రాజమండ్రి, జూన్ 1, 
చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ అనంత బాబు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ కేడర్‌ కూడా ఆయన్ని ఘనంగానే స్వాగతించింది. అయితే.. ఇక్కడే ఒక ప్రాధమికమైన అనుమానం వస్తోందట. అధికార పార్టీ ఆయన మీద సస్పెన్షన్‌ని ఎత్తేసిందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.తన కారు డ్రైవర్‌ హత్య, అరెస్ట్‌ తర్వాత అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైసీపీ నాయకత్వం. ఈ కేసులో ఆయన 210 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి.. గత డిసెంబర్ 15వ తేదీన బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయినా…రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టు నిలుపుకోవడానికి రంపచోడవరంలో తాజాగా పొలిటికల్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది చూసి ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ… వాస్తవానికి ఎమ్మెల్సీ మీద సస్పెన్షన్‌ని ఇంకా ఎత్తేయలేదు అధికార పార్టీ. అలాంటప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారన్న ప్రశ్నకు నాయకులు ఎవరి దగ్గరా సమాధానం లేదు. పైకి సస్పెండ్‌ అంటున్నా… వాస్తవానికి ఆయన పార్టీ తరపున తిరగాలనే నాయకత్వం కోరుకుంటోందని, అందుకే .. సస్పెండైన వ్యక్తి పార్టీ నాయకుడిలా హడావిడి చేస్తున్నా.. చూసీ చూడనట్టుగా ఉంటోందని చెప్పుకుంటున్నారు. అనంతబాబుకు రంపచోడవరం ఏరియా గిరిజనుల్లో గట్టి పట్టుంది. ఎమ్మెల్యే ధనలక్ష్మికి మరోసారి టిక్కెట్‌ ఇవ్వాలని డిసైడైన వైసీపీ అధినాయకత్వం ఆమె మళ్ళీ గెలవాలంటే అనంతబాబు బయట తిరగాల్సిందేనని గట్టిగా నమ్ముతోందట. అందుకే కేసు పేరు చెప్పి పైకి సస్పెండ్‌ చేసినా…పరోక్షంగా పని చేసుకొమ్మని సంకేతాలు పంపినట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. రీ ఎంట్రీపై నాయకత్వపు మౌనానికి అదే కారణం అని అంటున్నారు.రంపచోడవరం కేంద్రంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభ నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,నియోజకవర్గ పరిశీలకుడు పరీక్షిత్ రాజ్, నియోజకవర్గానికి చెందిన జడ్పీటిసిలు,ఎంపీటీసీలు సభకు రావడంతో.. అనంతబాబుపై సస్పెన్షన్‌ని ఎత్తేశారనే సంకేతాలు వెళ్ళాయట. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన్ని అసలు రాజ్యాంగ పదవి నుంచి కూడా తప్పించాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఆయన మీదున్న పార్టీ పరమైన సస్పెన్షన్‌ని ఎత్తేస్తుందా? లేక సస్పెన్షన్‌ సస్పెన్షనే… నీ పని నీదేనని ఆయనకు ఆయనకు భరోసా ఇస్తుందా అన్నది చూడాలి.

Related Posts