YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోడెల ఫ్యామిలీకి చెక్

కోడెల ఫ్యామిలీకి చెక్

గుంటూరు, జూన్ 1, 
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జీ నియమితులయ్యారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం ఇది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావును 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కోడెల కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు శివరాంకు టికెట్ లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీనికి భిన్నంగా సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది తెలుగుదేశం పార్టీ. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. కోడెల శివరాం లేదా ఆయన కుటుంబానికి టికెట్ కేటాయించట్లేదనే విషయాన్ని టీడీపీ చెప్పకనే చెప్పినట్టయింది. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బరిలోకి దింపింది టీడీపీ. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ సొంత నియోజకవర్గం పెదకూరపాడు. వరుసగా అయిదుసార్లు ఆయన ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009లో గుంటూరు వెస్ట్‌కు మారిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కాపు, రెడ్డి సామాజిక వర్గం ఓటుబ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉండే నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో- వైఎస్ఆర్సీపీ ఎలాంటి ప్రతివ్యూహాన్ని రూపొందిస్తుందనేది ఆసక్తిగా మారింది. సత్తెనపల్లికే చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరిన నేపథ్యంలో ఆయనకు లేదా ఆయన కుమారుడు నితిన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

Related Posts