YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

హైదరాబాద్, జూన్ 7, 
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు మొదలయ్యాయి. తెలంగాణపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెంచాయి. కర్నాటక ఫలితాలనే తెలంగాణలోనే రిపీట్ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. రాహుల్ గాంధీ అయితే ఏకంగా అమెరికా పర్యటనలో హూంకారమే చేశారు. తెలంగాణ నుంచి బీజేపీని ఊడ్చి పారేస్తామని ఆయన భీషణ ప్రకటన చేశారు. తద్వారా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు రాహుల్ గాంధీ. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన బీజేపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెంచేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భాగంగా ప్రజల్లోకి వెళ్తుంది. అయితే అసలు టార్గెట్ మాత్రం తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమేనని తెలుస్తోంది. జూన్ 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మంకు రానున్నారు. 25వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్న జేపీ నడ్డా.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో భారీ బహిరంగ సభకు ఫ్లాన్ చేస్తోంది రాష్ట్ర పార్టీ నాయకత్వం. అయితే, మోదీతో హైదరాబాద్ నగరంలో సుదీర్ఘ రోడ్ షో నిర్వహించే విషయం ఫైనల్ దశలో వుందని సమాచారం. పీఎంఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీ నాయకత్వం మోదీ రోడ్ షోపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు కాషాయ దళం ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్క జూన్ నెలలోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఒక్కో సభకు ఒక్కో అగ్రనేత ముఖ్యఅతిథిగా పాల్గొనేలా మూడు భారీ బహిరంగసభల నిర్వహణకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న సంకేతాలను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా వ్యూహం రచించింది భారతీయ జనతా పార్టీ.కర్నాటకలో ప్రతికూల ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి బయటపడేందుకు ముగ్గురు అగ్రనేతలను జూన్ నెలలోనే తెలంగాణ పర్యటనలకు తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పైకి 9 ఏళ్ల మోదీ పాలన పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా మహా జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణలో మూడు లేదా నాలుగు బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని, కేడర్లను ఎన్నికలకు సమాయాత్తం చేయడంలో భాగంగానే ఈ సభలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఒకటి రెండేళ్లుగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే సమయంలోనే తెలంగాణలో పొత్తుల చుట్టూ ఇప్పుడు ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో అమిత్‌షా- చంద్రబాబు భేటీ జరిగింది. దీంతో పాత స్నేహం చిగురిస్తుందా అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడలేదు. బీజేపీ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేదు. పొత్తులు ఉండొచ్చంటూ ఊహాగానాలే తప్ప దాన్ని బలపరిచేలా రెండు వైపుల నుంచి ఎలాంటి ప్రకటనలు లేవనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీరణ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, టీడీపీతో పొత్తు కేవలం ఊహాగానమేనని బండి సంజయ్ కుమార్ ఆఫ్ ది రికార్డు చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి సైతం టీవీ9 బిగ్ డిబేట్‌లో పాల్గొని ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీతో జతకట్టాల్సిన అవసరం లేనేలేదని ప్రకాశ్ రెడ్డి అన్నారు. అయితే, పొత్తులపై తేల్చేది రాష్ట్ర నాయకత్వం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో చంద్రబాబుకు బీజేపీ ఓటుబ్యాంకు ఉపయోగపడితే.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీకి ఎంతో కొంత ఓటుబ్యాంకు వుంది. అది తెలంగాణలో బీజేపీ వైపు మళ్ళాలన్నది ఉభయకుశలోపరి చంద్రబాబు, అమిత్ షాల ప్రతిపాదన అని తెలుస్తోంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలు తర్వాత తెలంగాణలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, మునుగోడులో స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం, ఇటీవలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీలో ఏకంగా 48 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఒక్క కర్నాటకలో ప్రతికూల ఫలితం మినహాయిస్తే మిగతా అంశాల్లో ఆ పార్టీ రాష్ట్రంలో మంచి ఊపుమీద ఉంది. ఈ నేపథ్యంలో ఇదే జోరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతో పాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని కమలదళం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.ఇక కర్నాటక విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ నేతలు తాజాగా దూకుడు పెంచారు. పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరాలతో తెలంగాణలో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్లాన్ చేస్తోంది. అమెరికా పర్యటనలో వున్న రాహుల్ గాంధీ ఇండియాకు చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ షెడ్యూలును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి ఆయన అమెరికాలో వున్నప్పటికీ రాహుల్ టీమ్ తెలంగాణపై ఫోకస్ కొనసాగిస్తోంది. ఓవైపు వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తూనే ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేసింది రాహుల్ గాంధీ టీమ్. ఇందులో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు గాలమేయడంలో రాహుల్ బృందం దాదాపు విజయవంతమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వున్న సమాచారం నిజమైతే జూపల్లి, పొంగులేటి జూన్ మూడో వారంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోబోతున్నారు. చేరికలతోపాటు రాహుల్, ప్రియాంకలిద్దరు తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జూన్ 21న గానీ, 25న గానీ అయితే రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో జరపనున్న భారీ బహిరంగ సభల్లో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి పొంగులేటి, జూపల్లిలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీజేపీ నేతలు కూడా శతవిధాలా ప్రయత్నించారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ వీరిద్దరితో పలు విడతలుగా సమాలోచనలు జరిపారు. ఏకంగా ఖమ్మం వెళ్ళి కూడా గంటల తరబడి చర్చలు జరిపారు. ఆ తర్వాత శామీర్‌పేటలోని ఈటల ఫామ్ హౌజ్‌లో వీరితో బీజేపీ నేతల చివరి విడత సమాలోచనలు సుదీర్ఘంగా జరిగాయి. ఆ తర్వాత పరిణామాలు మారిోయాయి. వీరిద్దరు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు పయనిస్తున్నట్లు క్రమంగా క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఓ సందర్బంలో ఈటల చేసిన కామెంట్లు సంచనలమయ్యాయి. ఈ ఇద్దరు నేతలు (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు) తనకు రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని ఈటల వ్యాఖ్యానించడంతో వారిపై బీజేపీ ఆశలు వదులుకున్నట్లుగా తేలిపోయింది.ఇన్నాళ్లూ వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపగలిగాను తప్ప వారి మనసు మార్చలేకపోయానన్నది ఈటల రాజేందర్ కామెంట్ల సారాంశం. మరోవైపు బీజేపీ నేతల కంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దానికి కర్నాటక ఫలితం తోడవడంతో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లితో రాహుల్‌ గాంధీ టీమ్‌ రహస్యంగా సమావేశమై చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. పొంగులేటి, జూపల్లి చేరడమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్‌ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ షరతులకు రాహుల్‌ గాంధీ టీమ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి ఇద్దరికీ టికెట్స్‌ ఇవ్వడంతోపాటు.. వాళ్ల అనుచరులకు టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ఇక జూన్ నెలలో రాహుల్, ప్రియాంక వేరువేరుగా లేదా కలిసి తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి
 

Related Posts