YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొలిటికల్ క్యాంపెయిన్లు... గంటల కొద్ది ట్రాఫిక్ జామ్

పొలిటికల్ క్యాంపెయిన్లు... గంటల కొద్ది ట్రాఫిక్ జామ్

విజయవాడ, ఏప్రిల్ 16,
ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు.. ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా నిర్వహిస్తున్న రోడ్ షోలు సామాన్యులకు నరకం చూపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నాలైన, అర్థరాత్రులైనా గంటల తరబడి రోడ్ల మీదలో వాహనాలు నిలిచిపోతున్నాయి. జనం కోసం జనంలోకి వస్తున్నామని చెబుతున్న పార్టీల నేతలు తమ చర్యలతో జనాన్ని ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని మాత్రం చాలా సులువుగా విస్మరిస్తున్నాయి.ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో రోడ్ల మీద ప్రయాణం నరకంలా మారింది. రాజకీయ పార్టీలు పోటా పోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జనాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు నుంచి ఏపీ రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ తరపున చంద్రబాబు, నారా లోకేష్‌ వేర్వేరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్‌ కూడా ఇటీవల విడిగా వారాహి యాత్రలు, ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబుతో రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు.ఏ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినా ఆ సభలు, సమావేశాలకు ఎన్ని లక్షల మంది హాజరయ్యారనే ప్రచారమే ప్రధాన అంశంగా మారుతోంది. వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలకు ఒక్కో సభకు పది లక్షల మంది హాజరయ్యారని ప్రచారం జరిగింది.వందలు, వేల మంది ప్రయాణానికి సరిపోయే రోడ్ల మీద వేల సంఖ్యలో వాహనాలు వచ్చే బలప్రదర్శన కోసం వచ్చేస్తున్నాయి. హంగు, ఆర్భాటంతో రాజకీయ పార్టీలు చేస్తున్న యాత్రలు సామాన్య జనానికి నరకం చూపిస్తున్నాయి. ఇక జాతీయ రహదారులపై జరుగుతున్న యాత్రలతో రోడ్ల మీద ప్రయాణాలు అంటేనే ప్రజలు హడలిపోవాల్సి వస్తోంది.శనివారం సాయంత్రం నంబూరు, మంగళగిరి, తాడేపల్లి మీదుగా సిఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర.. తాడేపల్లిలో కృష్ణా వారధిపైకి వచ్చింది. వారధి వరకు ఆరు లేన్లతో ఉండే చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి, వారధిపై డబుల్‌ లేన్‌గా మారిపోతుంది.సిఎం జగన్‌ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, వందలాది వాహనాలతో ర్యాలీగా విజయవాడలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమం గంటపాటు సాగింది. సిఎం కాన్వాయ్‌ హైవే దాటుకుని విజయవాడ రోడ్లలోకి వెళ్లినా తర్వాత కూడా జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ కాలేదు. విజయవాడ వారధి నుంచి గుంటూరు వరకు దాదాపు 30కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. సిక్స్‌లేన్‌ మీద ప్రయాణించిన వాహనాలు మెల్లగా ముందుకు సాగుతూ విజయవాడలోకి రావడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది.రాజకీయ ప్రదర్శనలు, ర్యాలీల సమయంలో వివిఐపి మూమెంట్‌ పెడుతున్న శ్రద్ధలో పదో వంతు కూడా పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్దీకరణపై ఉంచడం లేదు. ట్రాఫిక్ నెమ్మదించిన సమయంలో ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ఇక జనం పని అయిపోయినట్టే. ఆ వాహనాలను క్లియర్‌ చేయడానికి క్రేన్లు వారధి సమీపంలో మాత్రమే ఉంటాయి. ట్రాఫిక్ దాటుకుని అవి స్పాట్‌‌కు చేరాలంటే గంటల సమయం పడుతోంది. తరచూ ఈ సమస్య తలెత్తుతోంది.సోమవారం సిఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత కోల్‌కత్తా జాతీయ రహదారిపై గన్నవరం సమీపంలో వాహనాలు నిలిచిపోయాయి. సిఎం బస్సు యాత్ర సాగే రూట్‌ మ్యాప్‌ విషయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా వాటిపై ప్రజలకు మాత్రం అవగాహన కల్పించడం లేదు. ట్రాఫిక్ మళ్లింపులు, భారీ వాహనాల నియంత్రణ, వాహనదారులకు అవగాహన లేకపోవడంతో ఎన్నికల ర్యాలీలు జరిగే రోడ్లపైకి వెళ్లిన వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి.గంటల తరబడి వృధాగా ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తోంది. చిన్నాచితక వాహనాలు, గూడ్స్ క్యారియర్లు ఇంధనం పూర్తిగా ఖర్చై రోడ్డు మీద ఆగిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల విషయంలో పార్టీలను నియంత్రించలేని పోలీసులు కనీసం ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో కూడా విఫలం అవుతున్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలన వినియోగించుకోవడంలో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ అప్డేట్స్‌ విషయంలో ఎఫ్‌ ఎం రేడియోలు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తారు. ఏపీలో ఆర్టీజిఎస్‌, విపత్తుల నిర్వహణ శాఖల ద్వారా మొబైల్ అప్డేట్స్ చేసే అవకాశం ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారు.

Related Posts