YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏసీబీ దూకుడు...

ఏసీబీ దూకుడు...

తెలంగాణ రాష్ట్రంలో  అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదు అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని అక్రమాస్తుల కేసు, గొర్రెల పంపిణీ స్కీమ్ లో కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు గత మూడు నెలల్లోనే జరిగాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ)గా సీవీ అనంద్ బాధ్యతలు స్వీకరించాక తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆయన నిత్యం జిల్లాల్లోని డీఎస్పీలతో మాట్లాడుతుండడం, సమీక్షలు నిర్వహిస్తుండడంతో వారు కూడా దూకుడు పెంచారు.  రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. 135  రోజుల్లో ఏకంగా 65  కి పైగా ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ లిస్ట్‌లో ఉన్నారు. పది రోజుల్లో పలువురు పోలీసులు కూడా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. మీర్‌పేట్‌ ఎస్సై, మాదాపూర్ ఎస్సై, స్టేషన్ రైటర్, అసిఫాబాద్ ఎస్సై ఏసీబీ వలలో పట్టుబట్టారు. లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు సాగుతోంది.రాష్ట్రంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టించింది. అతడికి బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తేలింది. అలాగే అతడి పేరిట మొత్తం 29 ఇండ్ల స్థలాలుండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ ఉంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌‌లో 4 , రంగారెడ్డి జిల్లాలో 3 అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. మొత్తంగా బహిరంగ మార్కెట్ లో ఆయన ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్ల పై మాటేనని తెలుస్తోంది. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని గత సర్కార్ హయాంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఆమె ఇంటితోపాటు బినామీలు, బంధువులకు చెందిన ఐదు ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో రూ.3.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువే రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె బినామీగా భావిస్తున్న వ్యక్తి పేరిట ధర్మసాగర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఏడు ఎకరాల్లో వెంచర్ వేసినట్లు గుర్తించారు. ఇందులో ఇంకా ప్లాట్లు అమ్మలేదని, వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. గొర్రెల పంపిణీ స్కీమ్ లో అవినీతి ప్రకంపనలు రేపింది. ఈ స్కామ్ పై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కామారెడ్డి వెటర్నరీ దవాఖాన అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ రవి, మేడ్చల్‌‌ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌‌డైరెక్టర్‌‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌‌ గణేశ్ను అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ పత్రాలు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సుమారు రూ. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.  . ఒకే రోజు ముగ్గురు అధికారులను ఏసీబీ ట్రాప్ చేసింది. ఒకే రోజు ఎస్సై, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డీఎంలను ఏసీబీ ట్రాప్ చేసింది. వీటితో పాటు గొర్రెల పంపిణీ మోసాలు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపైనా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ ట్రాప్స్, అక్రమాస్తుల కేసుల్లో దొరికిన ఆఫీసర్ల లెక్కల ప్రకారం.. మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, మున్సిపాలిటీల్లో బిల్డింగ్ నిర్మాణ అనుమతుల నుంచి బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ తదితర సర్టిఫికెట్ల మంజూరు వరకు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అవినీతి ఆఫీసర్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, పేపర్లలో కథనాలు వచ్చినా చర్యలు తీసుకోకుండా వెనకేసుకు రావడంతో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. కొత్త ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు ఇలాంటి ఆఫీసర్ల భరతం పడుతున్నారు.

Related Posts