
హైదరాబాద్, ఏప్రిల్ 25,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఎన్నికల్లో ఆయనే అంతా డిసైడ్ చేసేటట్లున్నారు. కేసీఆర్ పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. ఆయన సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారు. కేసీఆర్ చెప్పే వ్యూహాలను రాజకీయంగా అమలు చేయనున్నారు. అంతే తప్ప నియోజకవర్గాల్లో కేసీఆర్ జోక్యం మాత్రం ఇక ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా ఉండకపోవచ్చన్న ఊహాగానాలు గులాబీపార్టీలో జోరుగా ఊపందుకుంటున్నాయి. అదే సమయంలో కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు కూడా క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు అంటే రానున్న ఏడాది తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేసిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే అక్టోబరు నెలలో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇక తాజాగా కేటీఆర్ రాజేంద్ర నగర్ ఉప ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరును ప్రకటించడం కూడా ఈ చర్చకు కారణమయింది. ఏ మాత్రం కేసీఆర్ తో సంబంధం లేకుండా ముందుగానే, ఉప ఎన్నికల ఊసే లేకముందే అభ్యర్థిని ప్రకటించడంతో ఇంకా కారు స్టీరింగ్ కేటీఆర్ చేతుల్లోనే ఉన్నట్లు స్పష్టమయింది. కేసీఆర్ కూడా తొలి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక పెద్దగా ఆయన రాష్ట్రం కోసం పనిచేయాలన్న ఆకాంక్ష కూడా లేదు. దీంతో పాటు ఎక్కువ కాలం ఫామ్ హౌస్ లోనే పరిమితమవుతున్నారు. వ్యవసాయంలోనే ఆయన ఎక్కువ గడుపుతూ చాలా వరకూ సేద తీరుతున్నారు. వ్యవసాయ క్షేత్రం అంటే ఆయనకు మక్కువ. రాజకీయంలో అంచులన్నీచూశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు మిగిలిన రాజకీయ నేతలకు మాదిరిగా పెద్ద లక్ష్యాలు ఏవీ ఉండవు. కానీ తాను స్థాపించిన పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకు వస్తే చాలునన్న భావనలో ఉన్నారు. అందుకే ఈసారి ఎన్నికలలో కేటీఆర్ క్రియాశీలకంగా మారనున్నారు. టిక్కెట్లను కూడా ఆయనే కేటాయించనున్నారు. ఇది ఫైనల్ అంటూ గులాబీ పార్టీలే అభిప్రాయపడుతున్నాయి.