
హైదరాబాద్, ఏప్రిల్ 26,
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటట్లే కనిపిస్తున్నారు. ఆయన చేస్తున్నవ్యాఖ్యలు, చేస్తున్న పనులు మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకేనన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తరచూ ఆయన చేస్తున్న కామెంట్స్ అధికార పార్టీకి వ్యతిరేకంగా, తాను ఎన్నికై బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ సౌండ్ విన్న వారికి ఎవరికైనా దానం నాగేందర్ ఖచ్చితంగా తిరిగి కారు ఎక్కేందుకేనన్నది చిన్న పిల్లాడికి కూడా అర్థమవతుంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ కు అనుకూలంగా మారారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మొదటి నుంచి అంతే... అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా 2024లో పోటీ చేసిన దానంనాగేందర్ ఓటమి పాలయ్యారు. అయితే గత కొంతకాలంగా అధికార పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలను ఆపేయాలనంటూ ఆయన హుకుం జారీ చేశారు. హైడ్రా వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారి పోతుందని కూడా అన్నారు. అంతటితో ఆగకుండా దానం నాగేందర్ తన నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దానం నాగేందర్ మూసీ నది ప్రక్షాళన జరగాలంటూనే అదే సమయంలో పేదల ఇళ్లను కూల్చితే తాను ఒప్పుకోనని తెగేసి చెబుతున్నారు. దానం నాగేందర్ కు మంత్రి పదవి వస్తుందని భావించినా అది సాధ్యంకాలేదు. దీంతో నాగేందర్ ఫ్రస్టేషన్ కు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. తేలని నిర్ణయం తాజా వ్యాఖ్యలతో... ఇక మరో అడుగు ముందుకు వేసి హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వివాదంలో నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు కూడా అండగా నిలిచారు. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన విషయాల్లో తప్పేమీ లేదని అనడంతో దానం నాగేందర్ నేరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యానించినట్లు స్పష్టమవుతుంది. స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఏమీ అనలేదని దానం నాగేందర్ వెనకేసుకొచ్చారు. మరొక వైపు ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతమవుతుందని కూడా దానం నాగేందర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరవుతారన్న ఆయన కేసీఆర్ ను చూసేందుకు, ఆయన మాటలను వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అని కారులో కర్చీఫ్ వేసినట్లయింది.