
హైదరాబాద్, ఏప్రిల్ 26
తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోతున్నాయి. సూర్యుడు ఏ మాత్రం జాలి, దయ, కరుణ లేకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎండలు మరీ ఘోరంగా ఉన్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఎండతీవ్రత 45 డిగ్రీలుగా ఉంది. దీంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. వారం రోజుల్లో తెలంగాణలో హీట్ స్ట్రోక్ వల్ల దాదాపు 11 మంది చనిపోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ప్రజలు హీటో స్ట్రోక్పై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వేసవి కాలంలో వడదెబ్బను చాలామంది ఎదుర్కొంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అది ప్రాణాంతకమవుతుందని గుర్తించుకోవాలి. చాలామంది తెలియక దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి ప్రాణాలు హరించే సత్తా ఉందని తెలుసుకోవాలి. అందుకే హీట్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ వస్తే ఏమి చేయాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు.. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయి. అవి హీట్స్ట్రోక్కి దారితీస్తాయి. ఎండలో తిరిగినప్పుడు లేదా.. ఎండలో ఎక్కువ పని చేసినప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రతలు మారిపోయి వడదెబ్బకు దారితీస్తాయి. మేజర్ కేస్లలో హీట్ స్ట్రోక్ మెదడు, గుండె, మూత్రపిండాలు, కండారలపై తీవ్రమైన ప్రభావం చూపించి మృత్యువుకు దారి తీస్తాయి.
వడదెబ్బకు కారణాలివే..
అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లడం, పని చేయడం వడదెబ్బకు దారితీస్తాయి. శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోనప్పుడు.. డీహైడ్రేషన్ వల్ల కూడా హీట్ స్ట్రోక్ వస్తుంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఎక్కువగా శారీరకంగా కష్టపడినా కూడా దీని బారిన పడతారు. బిగుతుగా ఉండే డ్రెస్లు కూడా శరీరానికి గాలిని అందించకుండా ఉక్కబోతను పెంచి వడ దెబ్బ సమస్యలను రెట్టింపు చేస్తాయి. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వడదెబ్బ లక్షణాలివే..
శరీర ఉష్ణోగ్రత సడెన్గా పెరిగిపోతుంది. 104°F లేదా 40°C దాటిపోతుంది. చర్మం ఎర్రగా, వేడిగా మారుతుంది. ఎక్కువ చెమట రావడం వల్ల పొడిబారిపోతుంది కూడా. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కూడా వడదెబ్బ లక్షణాలే. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వడం, వాంతులు, కండరాలు వీక్గా మారడం, నడవలేకపోవడం కూడా హీటోస్ట్రోక్ లక్షణాలని చెప్తున్నారు నిపుణులు.
వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనో లేదా ఆఫీస్లోనో ఉండండి. వీలైనంత వరకు నీటిని తాగండి. మీకు దాహంగా లేకున్నా శరీరానికి నీటిని అందించండి. హైడ్రేషన్ని అందించే ఫుడ్స్ కూడా తినొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా, కంఫర్ట్గా ఉండే దుస్తులు వేసుకోండి. తలకు కచ్చితంగా క్యాప్ పెట్టుకోండి. లేదా స్కార్ఫ్ కట్టుకుని కళ్లకు షేడ్స్ పెట్టుకోండి. సన్స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాలి. దీనివల్ల శరీరం కూలింగ్ లక్షణాలు పొంది హీట్ బర్న్స్ రాకుండా చేస్తుంది. చల్లని నీటితో స్నానం చేయండి. వీలైనంతవరకు కూల్గా ఉండేందుకు ట్రై చేయండి. వేడి ఎక్కువగా ఉన్నసమయంలో శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా చూసుకోండి. పిల్లలు, ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
హీట్ స్ట్రోక్ వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్..
ఒకవేళ ఎవరైనా వడదెబ్బతో ఇబ్బంది పడుతుంటే వారికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించాలి. బాధిత వ్యక్తిని ముందు నీడలోకి తీసుకెళ్లాలి. శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులు తీసేయాలి. చల్లని నీటిని కాకుండా నార్మల్ నీటిని చిన్న చిన్నగా వ్యక్తికి అందించాలి. గాలి ఆడేలా చూసుకోవాలి. వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే మరీ మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ రాకుండా చూసుకోవచ్చు. కానీ మీకు వడదెబ్బ వస్తుందని అనిపించిన వెంటనే నీడ ఉండే ప్రదేశాలకు వెళ్లిపోండి. తగినంత నీటిని అందించడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత వరకు నిపుణుల సూచనలు ఫాలో అయిపోండి.