
వరంగల్, ఏప్రిల్ 26
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహదారుల ద్వారా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో మూడు జాతీయ రహదారులు సహా.. సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్‌ను కూడా సిద్ధం చేశారు.
వాహనాల రాకపోకలు ఇలా..
వరంగల్ నుంచి.. ఇది 163వ జాతీయ రహదారి. ఈ రూట్ గుండా వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు సహా హైదరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉంది.
సిద్దిపేట-హుస్నాబాద్ నుంచి.. ఇది 765వ డీజీ జాతీయ రహదారి. ఈ రూట్ నుంచి మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు సహా వెస్ట్ ఆదిలాబాద్.. (ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్ నియోజక వర్గాలు) నుంచి కార్యకర్తలు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కరీంనగర్ రూట్.. ఇది 563వ జాతీయ రహదారి. ఈ రూట్ గుండా ఉమ్మడి కరీంనగర్, ఈస్ట్ ఆదిలాబాద్ (సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొంత పరకాల నియోజకవర్గాలు) నుంచి కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది.
ధర్మసాగర్ రూట్.. ధర్మసాగర్ నుంచి చింతలపల్లి సభ జరిగే ప్రాంగణానికి అనుకుని ఉన్న రోడ్డు ఇది. ఈ రూట్ నుంచి స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల నుంచి వాహనాలు వచ్చే అవకాశం ఉంది.
5 జోన్లు..
జోన్ 1- నేషనల్ హైవే 163 మీదుగా గుడెప్పాడ్, ఆరేపల్లి, హసన్‌పర్తి, ఎల్లాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలతోపాటు.. హసన్‌పర్తి, ఎల్లాపూర్ మీదుగా ఈ పారింగ్ స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వరకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్న వాహనాలు.. హసన్‌పర్తి, ఎల్లాపూర్ మీదుగా ఈ జోన్-1 పార్కింగ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
జోన్ 2- కరుణాపురం, దేవన్నపేట, మడిపల్లి అనంతసాగర్ మీదుగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరో రూట్ వరంగల్ లోని నాయుడు పెట్రోల్ పంప్, భట్టుపల్లి, కడిపికొండ ఆర్‌వోబీ, మడికొండ మీదుగా.. దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్ నుంచి ఈ జోన్-2కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చింతగట్టు, జయగిరి, అనంతసాగర్ మీదుగా కూడా జోన్-2కు చేరుకోవచ్చు.
జోన్ 3- ధర్మసాగర్ మీదుగా దేవునూరు, దామెర, చింతలపల్లి నుంచి వచ్చే వాహనాలు చేసుకునేలా జోన్-3లో ఏర్పాట్లు చేశారు.
జోన్ 4- కరీంనగర్ జాతీయ రహదారి 563 మీదుగా వచ్చే వాహనాలు.. హుజూరాబాద్, కోతులనడుమ, గ్రానైట్ క్వారీ మీదుగా ఈ పార్కింగ్ జోన్-4కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
జోన్ 5- సిద్దిపేట జాతీయ రహదారి 765(డీజీ) మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్, ములనూరు, గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్, ఇందిరానగర్ మీదుగా జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మరో రూట్‌లో వేలేరు, కొత్తకొండ, ముత్తారం వైపు నుంచి జోన్-5 పార్కింగ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు జరిగాయి. మరో రూట్ కరీంనగర్ మీదుగా వచ్చే వాహనాలు కోతులనడుమ మీదుగా దారి మళ్లించుకుని గోపాల్‌పూర్, గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇందిరానగర్ నుంచి జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు వీటిని గమనించాలని నేతలు కోరారు. వరంగల్ సీపీ, స్థానిక పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి.. పార్కింగ్ జోన్ల గురించి వివరించారు. పోలీసులతో చర్చించి వీటిని ఫైనల్ చేశారు.