
హైదరాబాద్, ఏప్రిల్ 26
భవన నిర్మాణలు, లేఔట్ల అనుమతుల మంజూరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. వేగంగా, సులభంగా అనుమతులు పొందేలా 'బిల్డ్ నౌ' అప్లికేషన్ సేవలను ప్రవేశపెట్టింది. మొదట్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ సేవలు అందబాటులో ఉండగా… తాజాగా హెచ్ఎండీఏ పరిధిలోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి.టీజీ - బీపాస్ ద్వారా భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు వచ్చేవి. అయితే ఇందులో ఇబ్బందులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడంతో పాటు అత్యంత వేగంగా అనుమతులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ వ్యవస్థను తీసుకువచ్చింది. తొలుత ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలు చేయగా.. సత్ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ అప్లికేషన్ ప్రత్యేకతలు, వివరాలెంటో ఇక్కడ తెలుసుకోండి….
'బిల్డ్ నౌ' అప్లికేషన్ సేవలు - ముఖ్యమైన అంశాలు:
రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ అనే అప్లికేషన్ తీసుకువచ్చింది.ఈ అధునాతన అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ముందుగా ఈ సేవలను జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేశారు. దీని ద్వారానే దరఖాస్తులను స్వీకరించి… భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆటోమేషన్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేయడమే ‘బిల్డ్ నౌ’ సేవల ముఖ్య ఉద్దేశ్యం.
ప్రస్తుతం HMDA పరిధిలోనూ ఈ అప్లికేషన్ ద్వారానే అనుమతులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మన్సిపాలిటీల్లోనూ ఈ సేవలు అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ అప్లికేషన్ ద్వారా వేగంగా ప్రాసెస్ పూర్తవుతుంది. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ ఫేస్ అని అధికారులు చెబుతున్నారు.
గతంలో భవన నిర్మాణ అనుమతులు వారం నుంచి నెలరోజుల్లో వచ్చేవి. అయితే ఈ అప్లికేషన్ ద్వారా అత్యంత వేగంగా… నిమిషాల వ్యవధిలోనే ఔట్ పుట్ ఉంటుంది.
టీజీబీపాస్‌లో ఇన్‌స్టంట్ అప్రూవల్‌కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండేవి. కానీ బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో డిస్ ప్లే అవుతుంది.
ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎక్కువ రోజులు పట్టేది. కానీ ఎలాంటి భవనాలకైనా ఈ కొత్త అప్లికేషన్ ద్వారా నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది.
ప్రతి అప్లికేషన్ ను ధృవీకరించి ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి లోపాలు లేకుండా పని చేసేలా ఈ బిల్డ్ నౌ అప్లికేషన్ ను రూపొందించారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపకశాఖ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ, తదితర శాఖలన్నీ బిల్డ్ నౌతో అనుసంధానమై ఉంటాయి.