
వరంగల్, ఏప్రిల్ 26,
నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌కు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా.. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి సాయుధ బలగాలు దూసుకెళ్తున్నాయి. తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100 పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న బలగాలకు అత్యవసర సామగ్రి, ఆహార పదార్థాలను వెంకటాపురం నుంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.నడిపల్లి, పూజారికాంకేర్, నంబిలో ప్రధానంగా కాల్పులు జరుగుతున్నాయి. ఊసూరు, రాంపురం, భీమంరంపాడు, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, గుంజపర్తి, గల్గం, ఎలిమిడి, చెలిమెల, డోలీ, పామునూరు తదితర గ్రామాల్లో ఐఈడీ శబ్దాలు, కాల్పుల మోతతో అక్కడి జనం వణికిపోతున్నారు.ఎండ తీవ్రతకు భద్రతా బలగాలు వడదెబ్బ బారినపడుతున్నాయి. కూంబింగ్‌లో అస్వస్థతకు గురైన సుమారు 15 మందిని వెంకటాపురం చేర్చారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం పీఎల్‌జీఏ లక్ష్యంగానే పోలీసు బలగాలు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి..తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు ఛత్తీస్‌గఢ్ వైపు బీజాపుర్ జిల్లా ఊసూరు బ్లాక్ సరిహద్దులుగా సుమారు 90 కిలోమీటర్ల పొడవున ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి..దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉండటంతో.. కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. దాదాపు వెయ్యి మంది పీఎల్‌జీఏ సభ్యులు ఇక్కడే ఉన్నట్లు నిఘావర్గాల అనుమానిస్తున్నాయి.కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవ, వికాస్, దామోదర్ వంటి వారు ఈ గుట్టల్లోనే ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దీంతో సుమారు 3 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు సమాచారంకొందరు గుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరికొందరు ఊసూరు బ్లాక్‌తోపాటు ఇటు వాజేడు, వెంకటాపురం వైపు మకాం వేసినట్లు తెలుస్తోంది. అటువైపు ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో వేల సంఖ్యలో బలగాలు తిష్ఠ వేసి ఉన్న నేపథ్యంలో.. మావోయిస్టులు తెలంగాణ వైపు గుట్టలు దిగక తప్పదన్న అంచనాతో మాటు వేసినట్లు తెలుస్తోంది.మావోయిస్టు పార్టీలో పీఎల్‌జీఏనే మిలిటరీ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. 1999 డిసెంబరు 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శీలం నరేశ్ మృతిచెందారు. ఆ తరువాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీజీఏ) ఏర్పాటైంది.సీపీఐ-పీపుల్స్‌వార్‌తో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా2004 సెప్టెంబరు 21న విలీనమై.. సీపీఐ-మావోయిస్టుగా అవతరించింది. ఈ క్రమంలో మిలిటరీ విభాగం పీఎల్‌జీఏగా అవతరించింది..పార్టీలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ)కి కోరుట్లకు చెందిన దేవ్‌జీ నేతృత్వం వహిస్తున్నారు. కానీ.. మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆధ్వర్యంలోని మొదటి ప్లటూన్ కీలకంగా ఉంది. దీన్ని నిర్మూలించగలిగితే మావోయిస్టు సీఎంసీ బలహీనపడుతుందని నిఘావర్గాలు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల్లో హిడ్మా బృందం కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి.