
యాదాద్రి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వీర్ల పాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు యూనిట్ -1లో తెల్లవారుజామున ఘటన జరిగింది.పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ అవ్వడం తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం లో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతింది..వచ్చే నెలలో యూనిట్ వన్ ను ప్రారంభించాల్సి ఉండగా అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ప్రమాదం ద్వారా లోపాలను గుర్తించి, వాటిని వీలైనంత తొందరలో సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.